8 July, 2026 | 2:52 AM

కన్నెపల్లి పంప్ హౌజ్‌ను ప్రారంభించాలని బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన

08-07-2026 01:46 AM

సూర్యాపేట, జూలై 7 (విజయక్రాంతి) : కాలేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్ హౌజ్ ను తక్షణమే ప్రారంభించి, ఎండిపోతున్న ఆయకట్టుకు గోదావరి జలాలను విడుదల చేయాలని కోరుతూ సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయం ముందు రైతులు, బీఆర్‌ఎస్ శ్రేణులు మంగళవారం భారీ ఆందోళన నిర్వహించాయి. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు ప్రమాదం పొంచి ఉందన్నారు.

వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు . గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఏటా సకాలంలో నీరందించి రైతాంగాన్ని ఆదుకున్నదన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కన్నెపల్లి పంప్ హౌజ్ పునరుద్ధరణను నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కాళేశ్వరం జలాలను ఆపాలనే కుట్రలో భాగంగానే ఇలా వ్యవహరిస్తోందన్నారు.

సాగునీటి విషయంలో రాజకీయం పక్కనబెట్టి , రైతుల ప్రయోజనాలే పరమావధిగా తక్షణమే కన్నెపల్లి పంప్ హౌజ్ ను ప్రారంభించి ఆయకట్టుకు నీరు విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామన్నారు.తదుపరి ఇదే విషయంపై బీఆర్‌ఎస్ నాయకులు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, సత్యనారాయణ రెడ్డి, బాబు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.