ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి
కలెక్టర్ బి. చంద్రశేఖర్
నల్లగొండ టౌన్, జూలై 7 :ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు నీటి అవసరం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మండల వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు, సహాయ సంచాలకులతో వీడియో కాన్ఫరెన్స్లో పలు సూచనలు చేశారు.ఒకే పంటపై ఆధారపడకుండా కంది, జొన్న, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి పంటలను సాగు చేయాలని రైతులను ప్రోత్సహించాలన్నారు.
కందికి కనీస మద్దతు ధర ఉండటంతో అధికంగా సాగు చేయాలని, ఉత్పత్తి పెరిగినా మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఆయిల్ ఫామ్ వంటి ఉద్యానవన పంటలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.జిల్లాలో విత్తనాలకు కొరత రాకుండా తగిన నిల్వలు ఉంచాలని, నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని ప్రాంతాల్లో యూరియా, డీఏపీ అందుబాటులో ఉంచాలని, రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
కౌలు రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని, అక్రమ విక్రయాలపై నిఘా ఉంచాలని సూచించారు.రైతులందరూ ఆగస్టు 5వ తేదీలోగా 75% ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా చూడాలని ఆదేశించారు. వ్యవసాయ అధికారులు ప్రతిరోజూ రైతు వేదికల్లో అందుబాటులో ఉండి, విత్తనాలు, ఎరువుల నిల్వల వివరాలతో బ్యానర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.ఈ కాన్ఫరెన్స్లో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






