17-08-2025 12:24:08 PM
హైదరాబాద్: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద వస్తోందని.. 62 వేల క్యూసెక్కుల వరదను వృథాగా సముద్రంలోకి వదులుతున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(BRS MLA Harish Rao) మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నందిమేడారం పంపులను ఆన్ చేసి రిజర్వాయర్లను నింపాలని, కాంగ్రెస్ ప్రభుత్వానికి నీటీ విలువ తెలియదని మండిపడ్డారు. కృష్ణా, గోదావరిలో వందల టీఎంసీలను వృథాగా సముద్రంలోకి వదులుతున్నారని.. కేసీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ మీద కోపంతో రైతులకు అన్యాయం చేయొద్దన్నారు. బురద రాజకీయం చేస్తూ వరదను వృథాగా పోనీయొద్దని, గోదావరి పరివాహకంలో చాలా జలాశయాలు, చెరువులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
కాళేశ్వరం కూలిందనే దుష్ప్రచారాన్ని నిజం చేసేందుకు మోటార్లు ఆన్ చేయటం లేదని, మిడ్ మానేరులో ఇంకా 20 టీఎంసీల నీళ్లు నిండాల్సివుందని అన్నారు. మిడ్ మానేరు నింపుకుంటే యాసంగిలో రైతులకు మేలు కలుగుతుందని, ఎల్లంపల్లి నుంచి వెంటనే రోజుకు 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయాలని హరీష్ రావు తెలిపారు. ఎల్లంపల్లిలో 7 మోటార్లు ఉంటే 2 మోటార్లు మాత్రమే నడుపుతున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయొచ్చన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయకుంటే తాము వెళ్లి ఆన్ చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మళ్లీ పాతరోజులు వచ్చాయని పేర్కొన్నారు.