17-08-2025 11:28:32 AM
జిల్లా ఎస్పీ మహేష్. బి. గితే ఐపీఎస్..
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): శాంతియుత వాతావరణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్. బి. గితే ఐపీఎస్(District SP Mahesh. B. Gite IPS) సూచించారు. భద్రత, బందోబస్తు కొరకు గణేష్ ఆన్లైన్ నమోదు విధానం, తెలంగాణ రాష్ట్ర పోలీసు వెబ్‌సైట్‌లో గణేష్ విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపులకు అనుమతి కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో గణేష్ మండపం నిర్వహణకు మండపాల నిర్వహకులు తెలంగాణ పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్ https://policeportal.tspolice.gov.in/ నందు ధరఖాస్తు చేసుకోవాలని, ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపం నిర్వహణ, మండపంనకు సంబంధించిన సమాచారం కొరకు మాత్రమని, ఈ సమాచారం ద్వారా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందన్నారు. పోలీస్ శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని, ఆ తరువాతనే వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
గణేష్ మండపాల నిర్వాహకులు పాటించవలసిన నియమ నిబంధనలు...
1. గణేష్ మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వహకులదే.
2. ప్రతీ మండపం వద్ద తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
3. నిర్దేశించిన సమయనికి నిమార్జనం పూర్తి చేయాలి.
4. గణేష్ మండపాలు ప్రజా రవాణాకు,ఎమర్జెన్సీ వాహనాలకు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.
5. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో అనుమతులు తీసుకోవాలి.
6. గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్ల ను మండపంలో ఏర్పాటు చేయాలి.
7. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి.
8. మండపాల్లో శోభాయాత్ర సందర్భంగా ఎట్టిపరిస్థితులోను డిజేను ఏర్పాటు చేయరాదు.
9. గణేష్ మండపంలో 24 గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా నిర్వహకులు తగు చర్యలు తీసుకోవాలి.
10. గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శను దృష్టిలో వుంచుకోని మండపాలలో భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలి.
11. గణేష్ మండపాల వద్ద ఎప్పుడైన అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగా దగ్గరలో రెండు బకెట్ల నీళ్లు ఏర్పాటు చేసుకోవాలి.
12. గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట అడటం, అసభ్యకరమైన నృత్యాల ఏర్పాటు, అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం, పాటలు పాడటంపై పూర్తిగా నిషేధం.
13. విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి, పోలీసు అధికారుల తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారు.
14. మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు వ్యక్తులు కనిపించినట్లుయితే తక్షణమే డయల్ వంద గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.
సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి రూమర్స్, వదంతులను నమ్మకూడదు అని ఎవ్వరికైన ఎలాంటి సందేహాలు ఉన్న సంబంధిత పోలీసు వారికి లేదా వంద కి సమాచారం అందించలని సూచించారు.