17-08-2025 12:45:06 PM
హైదరాబాద్: బైక్ కోసం కన్నతండ్రినే చంపాలని చూశాడో కొడుకు.. తనకు బైక్ కొనివ్వలేదనే కోపంతో నిద్రపోతున్న తండ్రిని గొడ్డలితో నరికి దాడి చేశాడు. అడ్డు వచ్చిన తల్లిపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఈ అమానుష సంఘటన ఈ నెల 14న ఖమ్మం జిల్లా(Khammam District)లోని మంగళగూడెంలో జరిగింది. దాడిలో గాయపడిన తండ్రి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితులు, పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం... మంగళగూడెంకు చెందిన బండారు నాగయ్య-నాగలక్ష్మి దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. నాగయ్య చిన్న చిన్న పనులు చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చదువు మధ్యలోనే మానేసిన అతని కుమారుడు సతీష్(22) ఖాలీగా తిరుగుతున్నాడు. ఇటీవల, సెల్ ఫోన్ కావాలని అతను వాదించినప్పుడు, దానిని కొనడానికి డబ్బు అప్పుగా తీసుకున్నామని తల్లి నాగలక్ష్మి చెప్పింది.
రెండు నెలలుగా కొడుకు బైక్ కోసం వాదిస్తున్నప్పటికీ, బైక్ కొనడానికి తమ వద్ద తగినంత డబ్బు లేదని చెప్పిన తర్వాత కూడా కొడుకు మాట వినడం లేదని చెప్పింది. ఏదైనా పనిచేసి బైక్ కొనుక్కోమని చెప్పగా.. తమపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడని తల్లి వాపోయింది. ఈ నెల 13వ తేదీలోపు బైక్ కొనివ్వకుంటే ఇద్దరినీ చంపేస్తానని తన కుమారుడు బెదిరించాడని నాగలక్ష్మి మీడియాకు వివరించారు. ఈ నేపథ్యంలో 14వ తేదీ తెల్లవారుజామున సతీష్ తన తండ్రి నాగయ్యపై గొడ్డలితో దాడి చేశాడని, తాను ఆపడానికి వెళ్లినప్పుడు తనపై దాడి చేయడానికి ప్రయత్నించాడని ఆమె చెప్పింది. భయంతో కేకలు వేసి బయటకు పరిగెత్తానని చెప్పింది. తన అరుపులు విన్న చుట్టుపక్కల వారు తన కొడుకు పారిపోయాడని చెప్పింది. గొడ్డలి దాడిలో గాయపడిన తన భర్త నాగయ్యను ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించామని, తన కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేశానని నాగలక్ష్మి చెప్పారు.