2 June, 2026 | 1:04 PM

Breaking News

సీఎం రేవంత్ రెడ్డిపై కోవ లక్ష్మి ఫైర్

02-06-2026 12:27 PM

సమస్యలు దృష్టికి తీసుకువెళ్తానని అవకాశం ఇవ్వలేరు 

సీఎం జవాబు ఏం చెప్పాలో తెలియకనే అవకాశం ఇవ్వలేదు

ఆదివాసి ఎమ్మెల్యే ను అవమానించడం దారుణం 

ఆసిఫాబాద్(విజయక్రాంతి): సభకు అధ్యక్షత వహించాల్సిన నన్నే మాట్లాడనివ్వకుండా అవమానించారు. ఒక ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రి చూపిన ఈ వైఖరి అత్యంత బాధాకరం" అని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదే మాట్లాడారు. సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రోటోకాల్‌ను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. సభ సాక్షిగా సమస్యలు లేవనెత్తితే ఏం జవాబు చెప్పాలో అర్థం కాకనే సీఎం నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.

జిల్లా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే అడ్డుకున్నారని, ఇది తనను మాత్రమే కాకుండా మొత్తం ఆదివాసీ సమాజాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. "నేను ఆరు గ్యారెంటీల గురించి అడగడానికి వెళ్లలేదు. మా ప్రజల కష్టాలు చెప్పడానికి వెళ్లాను. గుండి బ్రిడ్జి, లక్మాపూర్ బ్రిడ్జి, వట్టివాగు ప్రాజెక్టు, కేబీ ప్రాజెక్టు, మెడికల్ కాలేజీ, తాగునీటి సమస్యలు, రోడ్ల దుస్థితి గురించి మాట్లాడాలని అనుకున్నాను. కానీ మాట్లాడనివ్వలేదు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"మెడికల్ కాలేజీలో 116 పోస్టులు ఉంటే కేవలం 12 పోస్టులే భర్తీ చేశారు. 300 పడకల ఆసుపత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. గ్రామాల్లో తాగునీరు లేదు. ఆదివాసీ ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అటవీ శాఖ అనుమతుల పేరుతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఇవన్నీ చెప్పాలనుకుంటే అవకాశం ఇవ్వలేదు" అని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులపై కూడా ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తే స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రజల సమస్యలు ఎందుకు చెప్పడం లేదు? ప్రజల ఇబ్బందులు చెప్పాల్సిన వారు చప్పట్లు కొట్టడానికే పరిమితమయ్యారు" అని వ్యాఖ్యానించారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రశ్నలు లేవనెత్తిన ఆమె, "వేల ఇళ్లు మంజూరు చేశామని చెబుతున్నారు. కానీ ఎన్ని ఇళ్లు పూర్తయ్యాయి? పూర్తి చేసిన వారికి డబ్బులు అందాయా? ప్రజాపాలన అంటున్నారు, ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. అసలు ఆ రాజ్యం ఎక్కడ ఉంది?" అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హామీలపై కూడా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. "మహిళలకు నెలకు రూ.2,500 ఎక్కడ? గ్యాస్ సబ్సిడీ ఎక్కడ? తులం బంగారం ఎక్కడ? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?" అని ప్రశ్నించారు. "నియోజకవర్గం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కనీసం రూ.100 కోట్ల నిధులు ప్రకటిస్తారని ఆశించాం. కానీ సభ పెట్టి ప్రచారం చేసుకోవడం తప్ప జిల్లాకు ఒరిగిందేమీ లేదు. ప్రజాధనంతో భారీ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు ఉపయోగపడే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు" అని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ, "జోడేఘాట్ అభివృద్ధికి రూ.25 కోట్లు ఖర్చు చేశారు. గుస్సాడి కళాకారుడు కనకరాజుకు ఇల్లు, కోటి రూపాయల నగదు ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలి" అని సవాల్ విసిరారు.

"సీఎం నన్ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా చూశారా, ఆదివాసీ మహిళగా చూశారా తెలియదు. కానీ సభకు అధ్యక్షత వహించాల్సిన నన్నే మాట్లాడనివ్వకపోవడం అత్యంత అవమానకరం. ప్రజా సమస్యలు చెప్పే అవకాశం కూడా లేకపోతే అలాంటి పదవులు ఎందుకు? అందుకే బాధతో సభ మధ్యలో నుంచి వెళ్లిపోయాను" అని కోవ లక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చివరగా, "ప్రజల కోసం పోరాడటం ఆపను. జిల్లా సమస్యల పరిష్కారం కోసం ఎంతవరకైనా వెళ్తాను. బీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది" అని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఆకాష్,వైస్ చైర్మన్ అహ్మద్, సింగల్ విండో చైర్మన్ అలిబిన్ హైమద్, సర్పంచ్ పోచయ్య, కౌన్సిలర్లు బాలకృష్ణ, నాగుబాయ్, పార్టీ మండల అధ్యక్షుడు  రవీందర్, టౌన్ అధ్యక్షుడు హైమద్, నాయకులు ని సార్ ,అశోక్ ,సాయి, కాసిం ,రవి, రాజ్ కుమార్ , అన్సార్ , నారాయణ ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.