2 June, 2026 | 1:33 PM

సఫాయి కార్మికులకు ఘన సన్మానం..

02-06-2026 12:25 PM

ఉద్యోగ విరమణ సందర్భంగా సేవలను కొనియాడిన గ్రామ పెద్దలు...

సిద్దిపేట రూరల్, జూన్ 2: చింతమడక గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా పారిశుద్ధ్య సేవలు అందించిన సఫాయి కార్మికులు మందమణెమ్మ, పెద్దిగాని జగన్, కుసా జ్యోతి, చెప్యాల శోభ ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా వారికి ఘన సన్మానం నిర్వహించారు. స్థానిక ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జవ్వాతి మహేష్ కుమార్ తన తండ్రి జవ్వాజి శంకరయ్య జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన వారు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సఫాయి కార్మికులు చేసిన సేవలు అమూల్యమని కొనియాడారు. గ్రామ ప్రజలు ఆరోగ్యంగా జీవించడానికి వారి నిరంతర కృషి, అంకితభావమే కారణమని పేర్కొన్నారు. పారిశుద్ధ్య పరిరక్షణలో విశేష సేవలందించిన వారికి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మొతుకు లత-శంకర్, ఆర్యవైశ్య సంఘం క్యాషియర్ పడకంటి విశ్వనాథం, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఉద్యోగ విరమణ పొందిన సఫాయి కార్మికులను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.