జలశక్తి సదస్సులో సమగ్ర జలభద్రత నమూనా
- దేశానికి దిశానిర్దేశం చేసేలా రాష్ట్ర జలవనరుల నిర్వహణ విధానం
- కేంద్రం--రాష్ట్రాల సమన్వయంతో సుస్థిర జలభద్రతకు ఉమ్మడి కార్యాచరణ
- నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా సుస్థిర జలవనరుల నిర్వహణకు సమన్వయంతో కూడిన కార్యాచరణ రూపొందించే లక్ష్యంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ(Union Ministry of Jal Shakti) ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించనున్న జాతీయ సదస్సు(National Conference)లో తెలంగాణ(Telangana) తన సమగ్ర జలభద్రత నమూనా(Comprehensive Water Security Model)ను దేశం ముందుంచనుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) వెల్లడించారు.
ఈ జాతీయ సదస్సు నేపథ్యంలో సోమవారం సచివాలయంలో నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. జాతీయ సదస్సులో తెలంగాణ తరఫున సమర్పించనున్న ప్రజెంటేషన్‌లలో పొందుపరచాల్సిన అంశాలు, రాష్ట్రంలో అమలవుతు న్న జలసంరక్షణ కార్యక్రమాలు, గొలుసుకట్టు చెరువుల పరిరక్షణ, జలవనరుల జియోట్యాగింగ్, భూగర్భజలాల పర్యవేక్షణతోపాటు దేశవ్యాప్తంగా అనుసరించదగిన సమగ్ర జలభద్రత విధానంపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.
దేశ జలభద్రతకు సంబంధించిన కీలక సవాళ్లపై కేంద్రం, రాష్ట్రాలు ఒకే వేదికపై చర్చించి భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేయనున్న నేపథ్యంలో ఈ సదస్సుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని మంత్రి పేర్కొన్నారు. జలవనరుల సంరక్షణ నుంచి ప్రజలకు సురక్షితమైన తాగునీటి సరఫరా వరకు వివిధ అంశాల్లోనూ కేంద్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం సాధిస్తూ, నిర్దిష్ట కాలపరిమితితో కూడిన జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని తెలిపారు.






