26-09-2025 02:00:21 PM
హైదరాబాద్: ఎర్రవల్లి నివాసంలో పార్టీ నేతలతో కేసీఆర్(Kalvakuntla Chandrashekar Ra) కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు, హరీష్ రావు, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, గ్రేటర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, తాజా పరిస్థితులపై కేసీఆర్ సమీక్షించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్(Maganti Sunitha Gopinath)ను పార్టీ అధినేత కేసీఆర్ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో త్వరలో జరుగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీ హిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న దివంగత మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యతనిస్తూ ఆమెను అభ్యర్ధిగా ఎంపిక చేశారు. చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా వారి నిబద్ధతను పరిశీలించిన మీదట మాగంటి గోపీనాథ్ పార్టీకి, ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపును గౌరవాన్నిస్తూ జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.