calender_icon.png 26 September, 2025 | 3:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాలపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

26-09-2025 01:05:35 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) పరిస్థితులపై తెలంగాణ సీఎస్ కె. రామకృష్ణా రావు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పలు జిల్లాల్లో ఈరోజు, రేపు రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Department of Meteorology) సూచనల మేరకు ఆయా జిల్లాల్లో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రమాదకర పరిస్థితులు ఉన్న చోట ముందస్తు హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.

హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తంగా ఉంచాలని, భారీగా నీరు చేరే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకునేలా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి సూచించారు. భారత వాతావరణ శాఖ (India Meteorological Department) నుండి భారీ వర్షపాతం హెచ్చరిక కారణంగా, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాలని సైబరాబాద్ పోలీసులు శుక్రవారం హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలకు సూచించారు. శుక్రవారం, శనివారం నగరంలో గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా, దీనితో పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ సహా పలు తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.