31 July, 2026 | 1:10 AM

చిట్యాలలో పరిశ్రమల కాలుష్యంపై బీఆర్‌ఎస్ పార్టీ ఆందోళన

31-07-2026 12:00 AM

దుర్వాసన వెదజల్లుతున్న పరిశ్రమలపై తక్షణ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు వినతి

చిట్యాల, జూలై 30: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని సమీప పరిశ్రమల నుంచి వెలువడుతున్న దుర్వాసనతో కూడిన కాలుష్యంపై బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గురు వారం ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎం.పి.ఎల్ పరిశ్రమతో పాటు ఇతర పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పట్టణ ప్రజలు శ్వాసకోశ సమస్యలు, కళ్ల మంటలు, తలనొప్పి తదితర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.

ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకుని కాలుష్యాన్ని నియంత్రించేలా సంబంధిత పరిశ్రమలకు కఠిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నా యకులు చిట్యాల మున్సిపల్ కమిషనర్ గు రులింగంకు వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కలిసి సంబంధిత పరిశ్రమలను వెంటనే తనిఖీ చేయాలని, కాలుష్య నియంత్రణ పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ముఖ్యంగా రాత్రి వేళల్లో అధికంగా దుర్వాసన వెదజల్లుతున్న పరిశ్రమలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజల ఆరోగ్యం కంటే పరిశ్రమల లాభాలు ముఖ్యమనే పరిస్థితి ఉండకూడదని, కాలుష్య సమస్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనలు చేపడతామని బీఆర్‌ఎస్ నాయకులు హెచ్చరించారు. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వం, సంబంధిత అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, జమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్, 2వ వార్డు కౌన్సిలర్ ఎస్.కే. షబానా అజీముద్దీన్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బొబ్బల శివశంకర్ రెడ్డి, ఆగు అశోక్ యాదవ్, నాలావత్ కృష్ణ, బోలుగూరి సైదులు, జిట్టా శేఖర్, సాయి రెడ్డి ప్రతాప్ రెడ్డి, కునూరు శంకర్, రుద్రారపు కృష్ణ, గండమల్ల శంకర్, తోటకూరి అనిల్, మద్ది మధు, సిల్వేరు రీశ్వంత్, చెరుకు బాలు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.