31 July, 2026 | 1:10 AM

25 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా చండూరు అభివృద్ధి

31-07-2026 12:00 AM

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

నల్లగొండ, జూలై 30 (విజయక్రాంతి): రాబోయే 25 ఏళ్లలో పెరిగే జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని చండూరు మున్సిపాలిటీని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అధికారులను ఆదేశించారు.

మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం ఆయన పర్యటించి అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగాజంగాల కాలనీలో స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 10 కొత్త గ్రౌండ్లెవల్ నీటి ట్యాంకులు నిర్మించడంతోపాటు నిరుపయోగంగా ఉన్న మరో 10 ట్యాంకులను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. అలాగే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి పాత భవనాన్ని తొలగించి నూతన భవనం నిర్మించాలని సూచించారు.

యునాని వైద్యంపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు.నిర్మాణంలో ఉన్న నూతన మున్సిపల్ కార్యాలయ భవనానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు ఎకరం స్థలంలో ఆధునిక సౌకర్యాలతో నూతన కార్యాలయాన్ని నిర్మించేందుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్యార్డు లేదా దేవాదాయశాఖకు చెందిన స్థలాల్లో అనువైన స్థలాన్ని పరిశీలించాలని ఇదే విషయమై మున్సిపల్ శాఖ కమిషనర్ శ్రీదేవితో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు.

చండూరు పట్టణంలో అంతర్గత రహదారులు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు. అందుకు అవసరమైన నిధుల మంజూరీ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతి వార్డులో సుమారు 20 మంది నిరుపేదలకు ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ బూతరాజు దశరథ, కౌన్సిలర్లు, కమిషనర్ మల్లేశం, డీఈ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.