1 May, 2026 | 5:15 PM

దోచుకోవడానికి, దాచుకోవడానికే ఎమ్మెల్యే పదవి

01-05-2026 03:56 PM

- గత ప్రభుత్వ పనులను తాను చెప్పుకుంటుండు...

- దేవాలయాలపైన రాజకీయాలా..?

- బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజిత్ కుమార్

మంచిర్యాల, (విజయక్రాంతి) : మంచిర్యాల నియోజక వర్గ ఎమ్మెల్యే రెండు సంవత్సరాలలో చేసింది ఏమిటంటే అడ్డగోలుగా దోచుకోవడం, దోచుకున్న పైసలు పంచుకోవడం, దాచుకోవడానికే సరిపోయిందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ అన్నారు. శుక్ర వారం మంచిర్యాల మాజీ ఎంఎల్ఏ నడిపెల్లి దివాకర్ రావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంఎల్ఏ ప్రధాన అనుచరుడు పంచిన వాటాల్లో తేడా వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే బినామీకి, ఎమ్మెల్యే కి విభేదాలు వచ్చాయని, ఆ సమాచారం మాతో పాటు మీడియా వారికి కొన్ని విషయాలు తెలుస్తున్నాయని, రానున్న రోజులలో లెక్కలతో సహా బయటికి వస్తాయన్నారు. 

గత ఎంఎల్ఏ చేసినవి తాను చేసినట్టు చెప్పుకుంటుండు...

ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రతిపాదన, ఆలోచన నడిపెల్లి దివాకర్ రావుదని, దానిని మంచిర్యాల ఎమ్మెల్యే చెప్పుకోవడం హస్యాస్పదమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజిత్ కుమార్ పేర్కొన్నారు. అనేక సందర్భాలలో ఏ ప్రాజెక్టులో నీరుంటుందో అక్కడ ఆక్వా ప్రాజెక్టు ఇవ్వాలనే ప్రతిపాదన ఉందంటున్నారని, గతంలో దివాకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎల్లంపల్లిలో టూరిజం కోసం, ఆక్వా ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదనలు పంపారని, దానికి అనుగుణంగానే ఆక్వా ప్రాజెక్టు మంజూరైందని, దీనిలో ఎంఎల్ఏ చేసిందేమీ లేదని, ఏమీ చేయని దానికి చేసినా అని చెప్పుకోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఇది ఒకటే కాదు మంచిర్యాలలో మాజీ ఎంఎల్ఏ దివాకర్ రావు చేసిన పనులను ప్రస్తుత ఎంఎల్ఏ చెప్పుకుంటున్నారన్నారు. లక్షెట్టిపేటలో ప్రభుత్వ ఆసుపత్రిని కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమైతే పదిసార్లు ఆసుపత్రిని విజిట్ చేసి, ప్రెస్ మీట్ లు పెట్టి మీరే హాస్పిటల్ కట్టినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ప్రజలు గమనిస్తున్నారన్నారు. 

అడ్డగోలు అవినీతి...

మంచిర్యాలలో నాలుగు కోట్ల స్మశాన వాటికను రూ. 14 కోట్లు బిల్లులు తీసుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని విజిత్ రావు ఆరోపించారు. మంచిర్యాల గోదావరి తీర ప్రాంతంలో కట్టే కరకట్ట విషయంలో కూడా అడ్డగోలుగా ఎస్టిమేట్ పెంచుకొని,పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. అంతే కాకుండా వేంపల్లి, పోచంపాడు గ్రామాలలో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట రూ. 500 కోట్ల విలువ చేసే దళితుల భూములను దోచుకున్నారని, నియోజక వర్గంలో మట్టి, ఇసుక, కొండలు, చెరువులు ఇలా అన్నింటి మీద పడి విపరీతంగా దోచుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి ఏమిటంటే.., ఎన్నో ఏళ్లుగా బ్యాంకులలో రూ. 500 కోట్ల అప్పును వడ్డీతో సహా ఈ రెండేండ్లలో పూర్తిగా కట్టడమేనన్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించి ఇవాళ ఎంఎల్ఏ కొడుకుకు ఇబ్బంది ఉండకూడదని మంచిర్యాల ప్రజల ఆస్తులను, సొమ్ములను దోచుక పోయి బ్యాంకులకు కట్టిన విషయం ప్రజలకు తెలుసునన్నారు. 

దేవాలయాల వద్ద రాజకీయమేనా...

జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయానికి అప్పటి ఎంఎల్ఏ దివాకర్ రావు రూ. 2 కోట్ల నిధులు మంజూరు చేస్తే ఆ పనులు మొదలుపెట్టకుండా, ఆ పనులు పూర్తయితే దివాకర్ కి పేరు వస్తుందని చెప్పి దేవుని దగ్గర కూడా రాజకీయం చేసి ఆ నిధులు నిలిపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా విజిత్ రావు ప్రశ్నించారు. విశ్వనాథ ఆలయానికి అద్దె రూపంలో వస్తున్న ఆదాయం లేకుండా చేసింది మీరు కాదా అని నిలదీశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు పెట్టం లక్ష్మణ్, సత్యం, రవీందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.