ఫొటోగ్రాఫర్ సతీశ్‌లాల్‌కు అరుదైన గౌరవం
ఎల్బీనగర్, మే 28 : హైదరాబాద్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ సతీశ్‌లాల్ అందేకార్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోని ఫొటోగ్రాఫర్లకు అందజేసే రెండో అత్యున్నత పురస్కారం ‘అసోసియేట్ హానర్’ను 170 ఏళ్ల చరిత్ర గల రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ సంస్థ ప్రతినిధులు అందజేశారు. ఈ మేరకు మంగళవారం నాగోల్‌లో ఫొటోగ్రాఫర్ సతీశ్‌లాల్ అభినందన సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫొటోగ్రఫీలో మన దేశం నుంచి తాను అత్యున్నత పురస్కారం అందుకోవడం గర్వంగా ఉందన్నారు.
పర్యావరణంలో తాబేలు, అలివ్‌రిడ్లి తాబేలు జీవవిధానం అనే అంశాలపై ఫొటో డాక్యుమెంటరీ నిర్వహించానన్నారు. అంతరించే దశలో ఉన్న అలివ్‌రిడ్లి తాబేళ్లపై పరిశోధన నిర్వహించానని తెలిపారు. పదేళ్లుగా ఒడిశా తీరప్రాంతంలో ‘అలివ్ రిడ్లి తాబేళ్ల జీవవిధానం’పై ఫొటో డాక్యుమెంటరీ తీశానని వివరించారు. మొత్తం 15 ఫొటోలను అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్లు పరిశీలించి, ‘అసోసియేట్ హానర్’కు ఎంపిక చేశారని సతీశ్‌లాల్ తెలిపారు. అంతర్జాతీయ అవార్డు అందుకున్న సతీశ్‌లాల్‌ను ఫొటోగ్రాఫర్లు. జర్నలిస్టులు, వివిధ రంగాల ప్రముఖులు అభినందించారు.






