10 August, 2026 | 8:08 PM

శ్రీ చైతన్య హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థిపై దారుణ దాడి..!

10-08-2026 07:02 PM

ర్యాగింగ్‌ పేరుతో 12 మంది విద్యార్థులు దాడి

కర్రలు, పైపులతో చితకబాదినట్లు ఆరోపణలు

జవహర్ నగర్,(విజయక్రాంతి): శ్రీచైతన్య హైస్కూల్‌ హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దారుణంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డికి చెందిన అభిషేక్‌ అనే విద్యార్థిపై రాత్రి సమయంలో సుమారు 12 మంది విద్యార్థులు కలిసి కర్రలు, పైపులతో దాడి చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. అంతటితో ఆగకుండా బూట్లతో ముఖంపై తొక్కుతూ విచక్షణారహితంగా కొట్టినట్లు తెలిపారు.

దాడిలో అభిషేక్‌ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అయితే మెట్లపై నుంచి కిందపడిపోవడంతో తమ కుమారుడికి గాయాలయ్యాయని పాఠశాల యాజమాన్యం ఫోన్‌ చేసి చెప్పిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పాఠశాలకు వెళ్లి కుమారుడిని ఇంటికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

ర్యాగింగ్‌ పేరుతో దాడి..?

తనపై సీనియర్‌ విద్యార్థులు ర్యాగింగ్‌ పేరుతో దాడి చేసినట్లు అభిషేక్‌ తల్లిదండ్రులకు చెప్పినట్లు సమాచారం. దీంతో అసలు ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని విచారించిన సమయంలో తోటి విద్యార్థులు తనపై దాడి చేసిన విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఒకవైపు హాస్టల్‌లో విద్యార్థుల భద్రతకు పాఠశాల యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాల్సి ఉండగా, ఇంతమంది విద్యార్థులు కలిసి దాడి చేసే వరకు విషయం యాజమాన్యం దృష్టికి రాకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.