మంత్రాల నెపంతో వృద్ధురాలి దారుణ హత్య
మహబూబాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో ఈనెల 12న రాత్రి దారుణ హత్యకు గురైన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు చేదించారు. తొర్రూర్ డిఎస్పి కృష్ణ కిషోర్ కథనం ప్రకారం సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వీరగాని రాధమ్మ (80) మండల కేంద్రంలో తన ఇంట్లో ఒంటరిగా జీవిస్తుంది.
రాధమ్మకు సమీప బంధువులైన వీరగాని ఉప్పలయ్య అతని సోదరుడు మహేష్ తమ కుటుంబాల ఎదుగుదలకు చేస్తున్న ప్రతి పని సంతృప్తికరంగా సాగక పోవడానికి రాధమ్మ మంత్రాలు చేయడమేనని మూఢనమ్మకంతో ఈనెల 12న రాత్రి ఎవరూ లేని సమయంలో ఇనుప రాడ్ తో రాధమ్మ తలపై కొట్టి చనిపోయిన తర్వాత పక్కనే ఉన్న చేతబావిలో పడేశారు.
అనంతరం మండల కేంద్రానికి సమీపంలోని బ్రాహ్మణపల్లి వాగులో హత్యకు వినియోగించిన ఇనుపరాడును పడేసి, రక్తం అంటిన దుస్తులను ఉతుక్కొని స్నానం చేసి తమ మిత్రుడు దువ్వ రాజుకు తమ చేసిన హత్య సంఘటన వివరించి భయపడుతుండగా ముగ్గురు కలిసి మద్యం సేవించి తర్వాత ఎవరి ఇంటికి వారు వెళ్లారన్నారు. వృద్ధురాలి దారుణ హత్య సంఘటన నేపథ్యంలో తొర్రూరు సిఐ గణేష్, నెల్లికుదురు ఎస్‌ఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో రెండు బృందాలుగా పోలీసులు విచారణ చేపట్టగా, సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించడం జరిగిందన్నారు.
ఈ సంఘటనకు ఇద్దరితోపాటు వీరికి సహకరించిన మరో వ్యక్తిని బుధవారం అరెస్ట్ చేసి, హత్యకు వినియోగించిన ఇనుప రాడ్డు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి తెలిపారు. హత్య కేసును చాకచక్యంగా ఛేదించిన సిఐ గణేష్, ఎస్ ఐ రమేష్ బాబు, కానిస్టేబుళ్లు శంకరయ్య, రవీందర్, యాకయ్య, సత్యనారాయణ, సుదీర్ లను డిఎస్పి అభినందించారు.




