calender_icon.png 18 September, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇప్పటికీ రజాకార్లు ఉన్నారు

18-09-2025 01:37:14 AM

  1. భారత ప్రజాస్వామ్య విధానానికి నిజాం వ్యతిరేకం
  2. ఆపరేషన్ పోలో పటేల్ నిర్ణయమే
  3. పటేల్ కలలుగన్న భారత్ కోసం ప్రధాని మోదీ కృషి
  4. భారతదేశం ఎవరిముందు తలదించదు
  5. తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
  6. అతి త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్
  7. మాటలతో వినకపోతే అర్థమయ్యే భాషలో చెప్తాం

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి) :  నిజాం భారత్‌కు మాత్రమే వ్యతిరేకం కాదు, భారత ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకమని.. ఇప్పటికీ దేశంలో రాజాకార్లు ఉన్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పుకొచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీ ఈ రోజును విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

ఇది భారత చరిత్రలో సువర్ణ అధ్యాయమన్నారు. 1947లో భారత దేశం స్వాతంత్య్రం పొందిన సమయంలో వివిధ రాజ్యాలు ఉండేవని గుర్తుచేశారు. ఆపరేషన్ పోలో పేరుతో సర్దార్ పటేల్ నిజాంను ఓడించారని వెల్లడించారు.  పహల్గాంలో  రజాకార్ల తరహాలో హత్య చేశారని.. ఆపరేషన్ సింధూర్ పేరుతో  బుద్ధి చెప్పామన్నారు. 

పటేల్ కలలను సాకారం చేసింది మోదీనే...

ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అఖండ భారత్ కోసం ప్రయత్నం చేశారని.. ఇప్పుడు ప్రధాని మోదీ ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.  పటేల్ కలలను సాకారం చేసింది ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వమే అని వెల్లడించారు. మోదీ తీసుకున్న నిర్ణయాలతో భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో నాలుగవ స్థానంలో నిలిచిందని.. త్వరలోనే మూడో స్థానంలోకి రాబోతో ందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆపరేషన్ సింధూర్‌లో మన సైన్యం శత్రువులను మతం అడిగి చం పలేదన్నారు. జైషే మహమ్మద్ లీడర్ మసూద్ అ జార్ కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేసి చంపింది భారత సైన్యం అని ఆ సంస్థకు చెందిన వారే ప్రకటించారన్నారు. మంచి మాటలతో మాటవినక పోతే వారికి అర్థమయ్యే భాషలో సమాధానం చెబుతుందని ఆపరేషన్ సింధూర్‌తో చూపించామన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదన్నారు. 

వికసిత్ భారత్ కోసం కలిసి పనిచేద్దాం : కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్

సెప్టెంబర్ 17 భారతదేశంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయమని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షకావత్ అన్నారు. దేశాన్ని వికసిత్ భారత్‌గా ఆవిష్కరించేందుకు అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. నిరంకుశ పాలనను తొలగించి హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం అయ్యిందని తెలిపారు. నిజాం, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయించేందుకు ప్రయత్నం చేశారని చెప్పారు.  

విలీనం కాకుంటే తెలంగాణ మరో పాకిస్తాన్ : కేంద్ర మంత్రి ‘బండి ’

భారత్‌లో తెలంగాణ విలీనం కాకుంటే మరో పాకిస్తాన్, మరో శ్రీలంక, మరో బంగ్లాదేశ్‌లా మారి ఆకలి కేకలతో అల్లాడేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.  రాష్ర్టంలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గల్లీగల్లీలో అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులుడు ఈటెల రాజేందర్, కేంద్ర కల్చర్ సెక్రటరీ వివేక్ అగర్వాల్, సీఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు పాల్గొన్నారు.

కర్ణాటకలో లేని అభ్యంతరం తెలంగాణలో ఎందుకు?: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

విమోచనానికి ముందు నిజాం ప్రైవేట్ ఆర్మీ అయిన ఎంఐఎం పార్టీకి సంబంధించిన రజాకారులు గ్రామాల మీద దాడులు చేసి, దోచుకోవడం,  ప్రజలపై దౌర్జన్యం చేసి వేలాది మందిని హత్య చేశారని, హిందూ మహిళలను వివస్త్రలు చేసి బతుకమ్మలాడించిన ఘటనలున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గుర్తు చేశారు.

అటువంటి దౌర్జన్యకాండ జరుగుతున్నప్పుడు, 13 నెలల తర్వాత, 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్  చొరవతో ఇక్కడ స్వేచ్ఛ, స్వాతంత్రం లభించిందన్నారు. అటువంటి చరిత్ర గురించి గతంలో కాంగ్రెస్ పార్టీ , బీఆర్‌ఎస్ పార్టీ , పాలకులు ఈ తరానికి, నవతరానికి తెలియకుండా దుర్మార్గంగా తొక్కిపెట్టారని విమర్శించారు.

హైదరాబాద్ సంస్థానంలోని కొన్ని జిల్లాలు కర్ణాటకలో కలిశాయని, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా హైదరాబాద్ ముక్తి దివస్ పేరుతో అధికారికంగా వేడుకలు నిర్వహిస్తుంటే తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వానికి ఏం రోగం వచ్చి హైదరాబాద్ ముక్తి దివస్‌ను ఎందుకు అధికారికంగా నిర్వహించలేదని ప్రశ్నించారు. మూడేళ్ల తర్వాత రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ లిబరేషన్ డే, హైదరాబాద్ విముక్తి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.