జూలై మొదటివారంలో బడ్జెట్ సమావేశాలు!
- పూర్తి స్థాయి బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
ఆరు గ్యారెంటీలకు మరో ౨౫ వేల కోట్లు ?
వచ్చే నెలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలం పూర్తి
కేంద్ర బడ్జెట్‌ను బట్టి రాష్ట్ర సమావేశాలపై నిర్ణయం
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): 2024-25 ఆర్థిక సంవత్స రానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. జూలై మొదటి వారంలో అసెంబ్లీలో ఫుల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే లక్ష్యంతో యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాఖలవారీగా సమీక్షలు నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో ఆయా విభాగాలు తమ అంచనాలను ఆర్థికశాఖ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వారంతానికల్లా వివిధ శాఖల నుంచి బడ్జెట్ అంచనాలను స్వీకరించనున్నట్లు సమాచారం. అనంతరం బడ్జెట్ రూకపకల్పనపై ఈ నెల 18వ తేదీ నుంచి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగనున్నారు. జూలై 1వ తేదీ కల్లా అన్ని శాఖల సమీక్షలను పూర్తి చేసి.. బడ్జెట్ కేటాయింపులను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లుతెలిసింది. ప్రభుత్వం సార్వ త్రిక ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీని గడువు జూలైతో ముగియనుంది.
కేంద్ర బడ్జెట్‌తో మెలిక
సాధారంగా కేంద్రం బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత.. రాష్ట్రం లో సమావేశాలు నిర్వహించి పద్దను సమర్పిస్తారు. కేంద్రం కేటాయింపులను బట్టి.. రాష్ట్రం కూడా కేటాయింపులను సవరించుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ఎప్పుడైనా కేంద్ర బడ్జెట్ తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తుంది. జూన్ 24 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణస్వీకా రం, స్పీకర్ ఎన్నిక ఉంటాయి. అయితే ఈ సమావేశాల్లో బడ్జెట్‌ను కేంద్రం సమర్పిస్తే.. రాష్ట్ర సర్కారు కూడా తమ పద్దను జూలై మొదటి వారంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఒకవేళ కేంద్రం బడ్జెట్ సమావేశాలను ఆలస్యం చేస్తే జూలై చివరివారంలో రాష్ట్ర సర్కారు పద్దును అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది.
గ్యారెంటీలకు 45 శాతం నిధుల పెంపు?
పూర్తిస్థాయి బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తు న్నాయి. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో గ్యారెంటీల అమలుకు రేవంత్ సర్కారు రూ.53,916 కోట్లను కేటాయించింది. అయితే ఈ నిధులు హామీల అమలుకు ఏమాత్రం సరిపోవని తెలుస్తోంది. రైతు రుణమాఫీకే వడ్డీలతో కలిపి ఏకంగా రూ.40 వేల కోట్ల వరకు అవసరం. మరోవైపు ప్రజావాణి దరఖాస్తులను బట్టి చూస్తే మిగతా హామీలకు రూ.53,916 కోట్లు ఏమాత్రం సరిపోవని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. అందుకే పూర్తిస్థాయి బడ్జెట్‌లో భారీగా నిధులను కేటాయించే అవకాశం ఉన్న ట్లు తెలుస్తున్నది.
మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ.2,500, ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు, వ్యవసాయ కార్మికలకు ఏడాదికి రూ.12 వేలు, వరిపంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, విద్యార్థులకు యువ వికాసం గ్యారెంటీ కింద రూ.5 లక్షలు.. తదితర హామీలను అమలుచేయాలంటే భారీగా నిధులు అవసరం అవుతుంది. దీంతో ఓటాన్ అకౌంట్‌లో కేటాయింపులకు అదనంగా మరో 40 శాతం నుంచి 45 శాతం వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే.. దాదాపు రూ.22 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లు ఫుల్ బడ్జెట్‌లో అదనంగా కేటాయించే అవకాశాలను పరిశీలిస్తున్నారు.






