రూ.37.80 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి31 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపల్ కౌన్సిల్ మొదటి సమావేశం రభసగా మారింది. బీఆర్‌ఎస్‌కు చెందిన కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం చైర్‌పర్సన్ ఎం. ఆకాష్ అధ్యక్షతన 2026 ఆర్థిక సంవత్సరానికి రూ.37.80 కోట్లు, వ్యయం రూ.37.80 కోట్లుగా రూపొందించిన బడ్జెట్‌ను కౌన్సిల్ ముందుంచి ఆమోదం పొందారు.
ఈ సమావేశానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, వైస్ చైర్పర్సన్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్, కౌన్సిల్ సభ్యులు, కార్యా లయ సిబ్బంది హాజరయ్యారు.అయితే బడ్జెట్ సమావేశం వివాదానికి దారితీసింది. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశాన్ని 10 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు బహిష్కరించినట్లు కౌన్సిలర్ అబ్దుల్లా తెలిపారు. చైర్మన్ గదిలో ఉన్న వైస్ చైర్మన్ కుర్చీని తొలగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. కౌన్సిల్ ఛాంబర్ ఏర్పాటుకు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేయడం ఏంటని కౌన్సిలర్ కార్తీక్ అన్నారు. నిధుల ఖర్చులో గోల్‌మాల్ జరిగిందని ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.




