ఇందిరమ్మ ఇండ్లతోనే పేదలకు ఆత్మగౌరవం
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్నగర్, జులై 12 (విజయక్రాంతి):ఇందిరమ్మ రాజ్యంలోనే పేద ప్రజల ఇండ్ల కల సాకారమవుతుందని, ఈ ఇండ్లు ప్రతి నిరుపేద కుటుంబానికి ఆత్మగౌరవాన్ని, ఇంటింటా సౌభాగ్యాన్ని అందిస్తాయని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డుతో పాటు తిమ్మాపూర్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, కాంగ్రెస్ నాయకులతో కలిసి వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.
అందులో భాగమే ఈ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. పేద ప్రజలు సమాజంలో తలఎత్తుకుని, ఆత్మగౌరవంతో జీవించాలనేదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.






