2 April, 2026 | 3:17 AM

పని చేసే ఇంట్లోనే కన్నం

02-04-2026 12:00 AM

కూతురితో కలిసి దొంగతనం చేసిన తల్లి

ఆదిలాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి) : కన్నా కూతురితో కలిసి పని చేసే ఇంట్లోనే దొంగతనం చేసిన తల్లిని పోలీసులు పట్టుకున్నారు. ఆమె నుండి బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం పోలీస్ హెడ్ క్వాటర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు.

ఇచ్చోడ మండల కేంద్రంలోని  టీచర్స్ కాలనీలో నివసిస్తున్న ఉపాధ్యాయుడు పవార్ ప్రేమ్ సింగ్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును చేదించినట్లు జిల్లా ఎస్పీ వివరించారు. బాధితుడు గత నెల 16న శుభకార్యానికి వెళ్లి తిరిగి వచ్చిన ఆయన ఇంట్లో భద్రపరచిన బంగారం, వెండిని ఆభరణాలు కనబడలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ప్రేమ్ సింగ్ శుభకార్యానికి వెళ్ళే విషయం తెలుసుకున్న ఇంటి పని మనిషి లక్ష్మి, తన కూతురితో కలిసి ముందుగానే కుట్ర పన్ని, ఇంటి వెనుక గది తలుపుకు గడియ పెట్టకుండా అలానే ఉంచింది.

ఇంటి యజమా నులు లేని సమయాన్ని అదునుగా చేసుకుని గతనెల 18వ తేదీన 10 తులాల బంగారం, 10 తులాల వెండిని అపహరించారు. ఈనెల 26న మరో శుభకార్యానికి వెళ్లే సందర్భంలో నగలు కనిపించకపోవడంతో, బాధితులు 27న ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అని తెలిపారు. పోలీసులు సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం ఆధారంగా సమగ్ర విచారణ చేపట్టి, నిందితులను గుర్తించడం జరిగిందని తెలిపారు.

తల్లి అత్యాశతో కూతురితో కలిసి దొంగతనానికి పాల్పడిందని తెలిపారు. దొంగిలించిన సొత్తును విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇచ్చోడ పట్టణంలో వారిని అదుపు లోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. వారి వద్ద నుంచి దొంగలించిన మొత్తం సొత్తును తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కేసును వేగంగా చేధించిన ఇచ్చోడ ఎస్హెచ్‌ఓ బండారి రాజు, ఎస్‌ఐ రమేష్, సిబ్బంది రుక్మారెడ్డిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.