ట్రంప్ దిష్టిబొమ్మ దహనం..
ఖమ్మం (విజయక్రాంతి): భారతీయులకు సంకెళ్ళు వేసి, ఇండియాకు విమానంలో తరలించి, అవమానించడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. ఈ సందర్బంగా ఖమ్మంలో సీపీఎం, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీల నేతృత్వంలో ట్రంప్ దిష్టిబొమ్మను ఊరేగించి, దహనం చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఎన్‌ఎస్‌పి క్యాంప్ ప్రధాన రహదారిపై ట్రంప్ దిష్టి బొమ్మను దహనం చేశారు. అలాగే సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ నేతృత్వంలో కాకతీయ యూనివర్శిటీ కాలేజీ క్యాంపస్‌లో వినూత్నగా తలకు ట్రంప్ మాస్క్ ధరించి, చేతికి సంకేళ్లు వేసుకుని, వినూత్నరీతిలో నిరసన తెలియజేశారు. అనంతరం ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్బంగా వేర్వేరుగా జరిగిన సభల్లో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. భారతీయులకు సంకెళ్లు వేసి, ఇండియాకు పంపించడం దారుణమైన చర్య అన్నారు. ఇది సామ్రాజ్యవాద దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. పిడిఎస్‌యు రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేశ్, జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ... ట్రంప్ ప్రభుత్వం భారతీయుల పట్ల క్రూరంగా ప్రవర్తించినా మోదీ ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యవాదులంతా ట్రంప్ చర్యలను ఖండించాలన్నారు.




