18 July, 2026 | 6:13 AM

మెట్లపైనే కాలిపోయిన మృతదేహాలు

14-06-2024 12:05 AM

కువైట్ అగ్నిప్రమాదంలో హృదయ విదారక దృశ్యాలు

మృతదేహాలు భారత్‌కు తీసుకొచ్చేందుకు చర్యలు

న్యూఢిల్లీ, జూన్ 13 : కువైట్‌లో భారతీయ కార్మికులు నివసించే ఓ అపార్టుమెం ట్‌లో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అగ్నిప్రమాద ఘటనలో పలు విషాదకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో మొత్తం 49 మంది దుర్మరణం పాలవ్వగా.. అందులో 42 మంది భారత్‌కు చెందిన వారే ఉండటం ఆందోళనకరంగా మారింది. మరణించిన వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. దీంతో మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వెల్లడించారు. “మృతులను గుర్తించిన వెంటనే వారి బంధువులకు సమాచారం ఇస్తాం. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మృతదేహాలను స్వదేశానికి తీసుకువస్తుంది” అని తెలిపారు. 

కువైట్ ప్రభుత్వంతో చర్చలు..

కాగా, ఈ దుర్ఘటనకు సంబంధించి కొన్ని హృదయ విదారక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అపార్టుమెంట్ మెట్లపై కాలిపోయిన మృతదేహాలు కనిపించాయని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు కిటికీలో నుంచి దూకి గాయపడగా, మరికొందరు భవనం పైభాగానికి వెళ్లలేక మంటల్లో చిక్కుకున్నట్లు పేర్కొం ది. ఈ ఘటనపై విదేశాంగమంత్రి జై శంకర్ కువైట్ ప్రభుత్వంతో మాట్లాడారు. అగ్నిప్రమాద మృతులను సాధ్యమైనంత త్వరగా వెనక్కి పంపేలా చూడాలని కోరారు. అలాగే గాయపడిన వారికి వైద్య సహాయం అందుతోందని చెప్పారు. కాగా, ఈ ఘటన నేప థ్యంలో విదేశాల్లో నివసిస్తోన్న భారతీయుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, పని ప్రదేశాల్లో మెరుగైన వసతులు కల్పించేలా బిల్లు తీసుకురావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.