యడియూరప్పకు షాక్
పోక్సో కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్
బెంగళూరు, జూన్ 13: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత బీఎస్ యడియూరప్పకు బెంగళూరులోని ఓ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. తన 17 ఏండ్ల కుమార్తెపై యడియూరప్ప గత ఫిబ్రవరిలో ఆయన ఇంట్లోనే లైంగికదాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేయటంతో అత్యంత కఠినమైన పోక్సో చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ 354 ఏ (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదైంది. తాము ఓ సాయం కోసం యడియూరప్ప ఇంటికి వెళ్లినప్పుడు ఆయన దారుణానికి ఒడిగట్టారని మహిళ ఆరోపించింది.
ఫిర్యా దు చేసిన మహిళ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో గత నెల బెంగళూరులోని ఓ దవాఖాన లో మరణించింది. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను యడియూరప్ప ఖండించారు. రాజకీయ ప్రతీకారంలో భాగంగానే ఈ కేసు పెట్టారని ఆరోపించారు. కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేసిన కొద్దిసేపటికే ఆయన ప్రత్యేక కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు శుక్రవారం విచారించనున్నది.
యడ్డీ అరెస్టు తప్పదేమో! : కర్ణాటక హోంమంత్రి
ఈ కేసులో యడియూరప్ప అరెస్టు తప్పకపోవచ్చని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర తెలిపారు. విచారణకు హాజరుకావాలని సీఐడీ పోలీసులు యడియూరప్పకు నోటీసులు జారీచేశారని, ఆయనను విచారించిన తర్వాత అరెస్టు చేసే అవకాశం ఉన్నదని చెప్పారు. ‘చట్టం ప్రకారమే యడియూరప్పకు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో 15వ తేదీ లోపు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు. సీఐడీ పోలీసులు ఈ కేసులో అన్ని నిబంధనలు పాటిస్తున్నారు. యడియూరప్ప వాగ్మూలాన్ని కూడా రికార్డు చేయాల్సి ఉన్నది’ అని పేర్కొన్నారు.






