జమిలికి క్యాబినెట్ ఓకే
పార్లమెంట్ ఈ సమావేశాల్లోనే ముసాయిదా బిల్లు!
47 జమిలి ఎన్నికలపై స్పందించిన పార్టీలు
32 అనుకూలం
15 వ్యతిరేకం
అభిప్రాయం తెలుపని పార్టీల్లో.. తెలుగు రాష్ట్రాల్లోని బీఆర్‌ఎస్, వైసీపీ, తెలుగుదేశం
ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోదీ మంత్రులకు కీలక సూచనలు చేశారు. బిల్లుపై ప్రజలకు అవగాహన కల్పించి, ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని మంత్రులకు ప్రధాని సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల ముసాయిదా బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
జమిలి ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న క్రమంలో దీనిపై ఏకాభిప్రాయం సాధించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి ఈ బిల్లును సిఫార్సు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
పలు రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతోనూ ఈ బిల్లుపై సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. ఇలా ఉండగా ౧౯౫౧ మధ్య జమిలి ఎన్నికలు జరిగాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ గుర్తుచేశారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చైర్మన్‌గా ఉన్నతస్థాయి కమిటీ దేశంలోని అన్ని వర్గాల నుంచి జమిలి ఎన్నికలపై అభిప్రాయాలు క్రోడీకరించిందని ఆయన చెప్పారు.
తరచూ ఎన్నికలు జరగడం దేశాభివృద్ధికి ఆటంకంగా మారిందని, ‘ఒకే దేశం ఎన్నిక’ మేలు అని ప్రధాని మోదీ పలుమార్లు చెప్పారు. జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తప్పుబట్టారు. ఇది ప్రాంతీయ పార్టీల గొంతును అణచివేసే చర్య అని తృణమూల్, ఆప్ పార్టీలు మండిపడ్డాయి.
జమిలి ఎన్నికలు భారత సమాఖ్య వ్యవస్థకు విఘాత మని పేర్కొ న్నాయి. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీచేశాయి. జమిలి బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉన్నందున డిసెంబర్ 13, 14 తేదీల్లో తప్పనిసరిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలని ఎంపీలను ఆదేశించాయి.






