18 July, 2026 | 3:57 AM

కోవింద్ నివేదిక అంశాలివి

13-12-2024 01:53 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: దేశంలో వేరువేరుగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా దేశ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తోందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి వాదిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం తన రెండో టర్మ్‌లో జమిలీ ఎన్నికల నిర్వహణపై అధ్యయనం కోసం 2023 సెప్టెంబర్‌లో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను నియమించింది.

కేంద్ర మంత్రి అమిత్ షా, అప్పటి లోక్‌సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్ సబ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాదది హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలను కమిటీలో సభ్యలుగా చేర్చింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, కమిటీ సెక్రటరీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా నితిన్ చంద్రకు బాధ్యతలు అప్పగించింది. 

18,626 పేజీల నివేదిక

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ దాదాపు 191 రోజులపాటు అధ్యయనం జరిపింది. పలు రంగాల్లోని నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. ప్రజల నుంచి కూడా కమిటీ సూచనలు, సలహాలు కోరగా 21,558 స్పందనలు వచ్చాయి. స్పందనలను పంపిన 80శాతం మంది ప్రజలు ఏకకాల ఎన్నికలను సమర్థించారు. వీటన్నింటినీ పరిశీలించిన అనంతరం దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా ఈ ఏడాది మార్చిలో తన అభిప్రాయం తెలిపింది. అంతేకాకుండా దాదాపు 18,626 పేజీల నివేదికను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించింది.  ఈ నివేదికకు కేంద్ర క్యాబినేట్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆమోదం తెలిపింది. ప్రస్తుత సమావేశాల్లో జమిలి బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి సిద్ధం అవుతోంది. 

కమిటీ ప్రధాన సిఫార్సులు

* దేశ వ్యాప్తంగా ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ముందుగా చట్టబద్ధంగా అనుకూల యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలి. 

* ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించాలి. మొదటి దశలో లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు నిర్వహించాలి.

* పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లో రెండో దశ ఎన్నికలు నిర్వహించాలి. ఈ రెండో దశలో దేశంలోని మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరిపించాలి.

* లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత లోక్‌సభ సమావేశమైన మొదటి రోజును రాష్ట్రపతి “అపాయింటెడ్ డేట్‌”గా ప్రకటించాల్సి ఉంటుంది. 

* ఈ “అపాయింటెడ్ డేట్‌” తర్వాత ఏర్పడిన రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం తదుపరి పార్లమెంట్ ఎన్నికల వరకూ మాత్రమే ఉంటుంది. 

* హంగ్ ఏర్పడినా లేదా అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వం పడిపోయినట్లయితే లోక్‌సభకు తాజాగా ఎన్నికలు నిర్వహించవచ్చు.

* అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వం పడిపోయి తాజా ఎన్నికలు జరిగితే మిగిలిన కాలానికి మాత్రమే లోక్‌సభ పని చేస్తుంది. అంతేతప్ప ఐదేళ్లపాటు కొనసాగకూడదు.

* రాష్ట్ర శాసనసభలకు కొత్తగా ఎన్నికలు జరిగి, వాటిని రద్దు చేయకపోతే ఆ శాసనసభల పదవి కాలం లోక్‌సభ కాలవ్యవధి ముగిసే వరకూ కొనసాగుతుంది. 

* రాష్ట్రాల ఎన్నికల కమిషన్‌ను సమన్వయం చేసుకుని ఎన్నికల సంఘం ఓటరు కార్డును తయారు చేస్తుంది. అలా తయారు చేసిన ఎలక్ట్రోరల్ నంబర్‌తోనే ఓటర్ల జాబితాను రూపొందిస్తుంది. 

* ఏకకాల ఎన్నికల కోసం ఈవీఎంలు, వీవీప్యాట్‌లు పోలింగ్ సిబ్బంది, భద్రతా బల గాల మోహరింపు వంటి ఇతర అవసరాల కోసం ఎన్నికల కమిషన్ ముందస్తు ప్రణాళికను రూపొందించుకోవాలి.

వన్ నేషన్ ఎలక్షన్‌పై పార్టీల వైఖరి

జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ దేశ వ్యాప్తంగా ఉన్న 62 రాజకీయ పార్టీలను సంప్రదించింది. ఇందులో కేవలం 47 పార్టీలు మాత్రమే స్పందించాయి. వాటిల్లో 32 పార్టీలు జమిలి ఎన్నికలకు మద్దతు తెలపగా 15 పార్టీలు వ్యతిరేకించాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్‌వాద్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్), ఏఐయూడీఎఫ్, తృణముల్ కాంగ్రెస్, ఏఐఎంఐఎం, సీపీఐ, డీఎంకే, నాగా పీపుల్స్ ఫ్రంట్, ఎస్పీ తదితర పార్టీలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి.

బీజేపీ, అన్నాడీఎంకే, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, అప్నాదళ్(సోనీలాల్), బిజు జనతా దళ్, లోక్ జనశక్తి పార్టీ(ఆర్), మిజో నేషనల్ ఫ్రంట్, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రగ్రెసివ్ పార్టీ, శివసేన, జనతాదళ్(యునైటెడ్) సిక్కిం క్రాంతికారి మోర్చా, తదిరత పార్టీలు జమిలి ఎన్నికలకు మద్దతిచ్చాయి. ఇదే సమయంలో తెలుగురాష్ట్రాల్లోని బీఆర్‌ఎస్, వైసీపీ, తెలుగుదేశం, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్, రాష్ట్రీయ జనతా దళ్, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తదిరల పార్టీలు జమిలి ఎన్నికలపై తమ అభిప్రాయలను తెలియజేయలేదు.