18 July, 2026 | 4:56 AM

గ్రేస్ మార్కులు రద్దు

14-06-2024 12:45 AM

1563 మందికి మళ్లీ నీట్ పరీక్ష నిర్వహిస్తాం

  1. సుప్రీంకోర్టుకు తెలిపిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
  2. గ్రేస్ మార్కులు తీసేసినవారికి ౨౩న మళ్లీ పరీక్ష
  3. ౩౦ ఫలితాలు.. పరీక్ష రాయటం విద్యార్థుల ఇష్టం 
  4. కౌన్సిలింగ్‌పై స్టేకు న్యాయస్థానం నిరాకరణ
  5. తదుపరి విచారణ జూలై ౮కి వాయిదా
  6. నీట్ పేపర్ లీక్ కాలేదు.. అందుకు ఆధారాలే లేవు
  7. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

న్యూఢిల్లీ, జూన్ 13: ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) 2024లో కొందరు విద్యార్థులకు కలిపిన గ్రేస్ మార్కులను రద్దుచేస్తున్నట్టు పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. ఈ పరీక్ష ఫలితాల ప్రకటనలో అక్రమాలు చోటుచేసుకున్నాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అధ్యయనం కోసం నిపుణుల కమిటీ వేశామని, ఆ కమిటీ ౧౫౬౩ మంది విద్యార్థులకు కలిపిన గ్రేస్ మార్కులను రద్దుచేయాలని కోరినట్టు సుప్రీంకోర్టుకు గురువారం విన్నవించింది. పరీక్ష రోజు ఈ విద్యార్థుల సమయం వృధా కావటం వల్లనే వారికి గ్రేస్ మార్కులు కలుపాల్సి వచ్చిందని, వివాదం నేపథ్యంలో ఆ మార్కులను తొలగిస్తున్నట్టు 

 వెల్లడించింది. నీట్ ఫలితాలను సవాల్ చేస్తూ ఫిజిక్స్‌వాలా కోచింగ్ సెంటర్ సీఈవో అలక్ పాండే దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన సెలవుకాల ధర్మాసనం ముందు ఎన్టీఏ గురువారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా ఎన్టీఏకు ధర్మాసనం పలు సూచనలు చేసింది. ‘గ్రేస్ మార్కులు కలిపిన ఆ ౧౫౬౩ మందికి ఈ నెల ౪న వెల్లడించిన ఫలితాల్లో జారీచేసిన స్కోర్‌కార్డులను రద్దుచేయండి. వారికి వాస్తవంగా వచ్చిన మార్కులతో మరోసారి స్కోర్‌కార్డులు ఇవ్వండి. మళ్లీ పరీక్ష రాసేందుకు ఆ విద్యార్థులకు అవకాశం ఇవ్వండి. ఈ పరీక్ష రాసేందుకు ఇష్టపడని విద్యార్థులకు మే ౫న నిర్వహించిన పరీక్షలో సాధించిన మార్కులనే కేటాయించండి’ అని ఆదేశించింది. అయితే, నీట్ కౌన్సెలింగ్‌ను మాత్రం ఆపేందుకు ఆదేశాలివ్వబోమని ధర్మాసనం స్పష్టంచేసింది. షెడ్యూల్ ప్రకారమే నీట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది.

తప్పు ఒప్పుకొన్న ఎన్టీఏ

గ్రేస్ మార్కులకు వ్యతిరేకంగా మొదటినుంచీ పోరాడుతున్న ఫిజిక్స్‌వాలా సీఈవో అలక్‌పాండే.. సుప్రీంకోర్టులో విచారణ అనంతరం స్పందించారు. కోర్టుముందు దాఖలుచేసిన అఫిడవిట్‌తో ఎన్టీఏ తన తప్పును ఒప్పుకొన్నట్టయ్యిందని అన్నారు. కొందరు విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలుపటం పూర్తిగా తప్పు అని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ ఇంకెన్ని అవకతవకలకు పాల్పడిందో తెలియదని, ఈ ఘటనతో ఆ సంస్థపై నమ్మకం సడలిందని విమర్శించారు. అయితే, నీట్ పేపర్ లీకైందన్న ఆరోపణలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోసిపుచ్చారు. పేపర్ లీకేజీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.