18 July, 2026 | 4:45 AM

వాతావరణ మార్పులతో పెరుగుతున్న లింగ అసమానత

15-06-2024 12:56 AM
  1. వ్యవసాయ ఉత్పాదకత తగ్గడంతో పోషకాహార లేమి
  2. ఆర్థిక సంక్షోభం వల్ల పెరుగుతున్న బాల్యవివాహాలు 
  3. అవాంచిత గర్భాలతో అనారోగ్యం 
  4. ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ, జూన్ 14: లింగ సమానత్వం, మహిళలు, బాలికల సాధికా రతను సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటిగా చేర్చుకున్నాం. కానీ, వాతా వరణ మార్పులు.. లింగ అసమానతలను మరింత తీవ్రం చేస్తున్నాయి. మహిళ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్) కలిసి నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

వాతావరణ మార్పుల వల్ల మహిళలు, చిన్నపిల్లలు దుర్భర పరిస్థి తులు ఎదుర్కొంటున్నట్లు ఈ పరిశోధన తెలిపింది. ప్రకృతి విపత్తులకు గురయ్యే ప్రాం తాల్లో ఈ సమస్య అధికంగా ఉందని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో మహిళలు, పిల్లలు తక్కువ బరువు, పోషకాహార లేమి, కుంగుబాటు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు స్పష్టం చేసింది. పేదరికం, లింగ పరమైన పాత్ర, బాధ్యతలు, సంప్రదాయంగా మహిళలు, పిల్లలకు ఇస్తున్న స్థానం వంటి కారణాలతో పాటు వాతావరణ సంక్షోభం కూడా వీరి తీవ్ర అనారోగ్యానికి కారణమవుతోందని అధ్యయనం తెలిపింది. 

పోషకాహార లోపంతో..

ప్రపంచంలో మెజారిటీ పేదలు మహిళలే. వీరు సహజ వనరులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. భారత్‌లో మహిళలు ఎక్కువగా వ్యవసాయమే జీవనోపాధిగా బతుకున్నారు. 2022 జరిగిన పీఎల్‌ఎఫ్‌ఎస్ సర్వే ప్రకారం 64.3 శాతం మంది మహిళలు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 76.2 శాతంగా ఉంది. వాతావరణ మార్పులతో నేల సారం క్షీణించడం, వర్షపాతంలో తగ్గుదల, పంట దిగుబడి తగ్గడం వంటి అంశాలు ఇప్పటికే పోషకాహార లోపంతో ఉన్న పేద మహిళలకు మరింత దుర్భర పరిస్థితులకు కారణమవుతున్నాయి. ధాన్యాల పోషక నాణ్యత కూడా క్లుమైట్ చేంజ్ వల్ల ప్రభావితమవుతోంది. దీని వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి. గర్భం, రుతుక్రమం, చనుబాలు ఇవ్వడంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇందుకు కారణం ఐరన్, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు అందకపోవడమే. పోషకాహార లోపం ఉన్న గర్భిణీలు తమ నవజాత శిశువులకు సూక్ష్మపోషకాలు అందించలేకపోతున్నారు. ఈ ప్రక్రియ తరతరాలకు వ్యాప్తి చెందుతోందని నివేదిక పేర్కొంది.

పురోగతి సాధిస్తేనే.. 

మహిళలపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు బహుముఖ అంశా లతో కూడిన విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరం. వాతావరణ మార్పులతో సంబంధం లేకుండా వివాహం, ప్రసవం, ఆరోగ్యం, పోషకాహారం మొదలైన అంశాల్లో పురోగతి సాధించేలా చూడాలి. ఈ విషయంలో చదువు పోషించే పాత్రను తక్కువ చేయలేం. అదేవిధంగా ఆహార భద్రతను మెరుగుపరచడం ద్వారా కుటుంబాలు బాల్య వివాహాలవైపు పోకుండా చేయగలం. సాక్షం అంగన్‌వాడీ, మిషన్ పోషణ్ 2.0 వంటి పోషకాహార మద్దతు పథకాలకు బడ్జెట్ పెంచాల్సి ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా వాతావరణ మార్పులతో ఏర్పడే పరిస్థితులను తట్టుకునేందుకు మహిళలు ముందుకు రావాలి. కుటుంబం, సమాజంలో వారికి సహజ గౌరవం లభించాలి. కుటుంబ పోషణలో వారు నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలి. 

అల్పాదాయ కుటుంబాల్లోనే..

యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్‌ఎఫ్‌పీఏ) నివేదిక ప్రకారం అత్యధిక ఆదాయం ఉన్న కుటుంబాలతో పోలిస్తే అల్పాదాయ కుటుంబాల్లో బాల్యవివాహాలు రెండింతలు అధికమని తెలిపింది. వరదలు, కరువు వల్ల బాలికలను చదువు మానిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అంతేకాకుండా లైంగిక హింస, కౌమార దశలో గర్భం దాల్చడానికి ఈ పరిస్థితులు దారి తీస్తున్నాయి. ప్రకృతి సంక్షోభంతో ఆదాయం, ఆస్తులు తగ్గడంతో కుటుంబాలు నేరుగా అమ్మాయిల వివాహానికే మొగ్గు చూపుతున్నాయి. ఇది ఓ ప్రక్రియలా మారింది. ఒకరి సంఖ్య తగ్గుతుందని ఈ విషయాన్ని తల్లిదండ్రులు సమర్థించుకుంటున్నారు. కానీ, ఈ నిర్ణయాలు యువతుల సాధికారతను దెబ్బతీస్తోంది. గర్భం, ప్రసవం వంటి అంశాల్లో స్వయంగా నిర్ణయం తీసుకునే హక్కు కోల్పోతున్నారు. ఫలితంగా అనాలోచిత గర్భాలు, పిల్లల మధ్య ఎడం లేకపోవడంతో తల్లుల ఆరోగ్యం దెబ్బతింటుంది. 

వలసలతో ఇబ్బందులు..

ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్ నివేదిక మరికొన్ని ఆందోళనకరమైన గణాంకాలను సైతం వెల్లడించింది. కరువు వల్ల బాల్యవివాహాలు 35 శాతం, కౌమార దశలో గర్భం దాల్చడం 17 శాతం, భార్యాభర్తల మధ్య హింస 50 శాతం పెరిగినట్లు తెలిపింది. వాతావరణ మార్పులతో వ్యవసాయ ఉత్పాదకత తగ్గి ఆదాయం, జీవనోపాధిపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోందని, అందువల్ల పురుషులు పనికోసం వల్ల వెళుతున్నారని నివేదిక పేర్కొంది. వలస వెళ్లేందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన కారణం మాత్రం ఉపాధి లేకపోవడమే.

అయితే, కొంత మంది డబ్బు లేకపోవడం లేదా సామాజిక అంశాలకు విలువనిచ్చి వలస వెళ్లేందుకు ఇష్టపడరు. ఈ పరిస్థితుల్లో ఉపాధి లేక కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారుతుంది. ఇది మహిళలపై హింసకు దారి తీస్తుందని సునీతి గార్గ్ అనే సామాజిక కార్యకర్త తెలిపారు. ఇక, బాల్యవివాహాలకు వాతావరణ మార్పులకు సంబంధం స్పష్టంగా చెప్పలేకపోయినా ఈ ప్రాంతాల్లోనే వీటి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో పిల్లలకు తొందరగా పెళ్లి చేయడమే ఇందుకు ఓ కారణంగా చెప్పవచ్చని నివేదిక అంచనా వేసింది.