ఫోన్ నంబర్‌కూ రిచార్జ్!
- కొత్త రూల్స్ రూపొందిస్తున్న ట్రాయ్
- నెట్‌వర్క్‌తోపాటు నంబర్‌కు వేరే రేటు
- మొబైల్ యూజర్లకు మద్దెల దరువే
న్యూఢిల్లీ, జూన్ 13: ఇప్పటికే నెలనెలా మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలు టారిఫ్‌లు పెంచుతూ మొబైల్ వినియోగదారులపై మోయలేని భారం మోపుతుండగా, త్వర లో మరింత నడ్డివిరిగే భారం మోపేందుకు టెలికం నియంత్రణ మండలి (ట్రాయ్) సిద్ధమవుతున్నది. నెట్‌వర్క్ రిచార్జ్‌లతోపాటు మనం తీసుకొనే ఫోన్ నంబర్‌కు ప్రత్యేకంగా రిచార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితులు కల్పించేందుకు చకచకా అడుగులు వేస్తున్నది. ఈ మేరకు నూతన సిఫారసులను ట్రాయ్ రూపొందిస్తున్నట్టు తెలిసింది. దేశంలోని మొబైల్ ఫోన్లు ప్రవేశించిన కొత్తలో సిమ్‌కార్డు కొనుగోలు చేస్తే మనకు నచ్చిన నెంబర్ ఇచ్చేవారు. రానురాను కంపెనీల మధ్య పోటీ పెరగటంతో ఇప్పుడు సిమ్‌కార్డులను ఉచితంగానే అందజేస్తున్నాయి. కానీ, నంబర్ మాత్రం కంపెనీలే రాండమ్‌గా అందిస్తున్నాయి. ఇకపై పరిస్థితులు మరింతగా మారిపోవచ్చు. ఫోన్ నంబర్లను విలువైన వనరుగా ట్రాయ్ భావిస్తున్నట్టు సమాచారం. అం దుకే వినియోగదారుడు ఒక ఫోన్‌నంబర్ వాడాలంటే దానికి కొంత రుసుము చెల్లించటంలో తప్పులేదని ట్రాయ్ వాదన.
నంబర్లు తగ్గించేందుకేనా?
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నవారిలో అత్యధిక మంది రెండు అంతకంటే ఎక్కువ నంబర్లనే వాడుతున్నారు. ఐఫోన్లతోసహా దాదాపు అన్ని ఫోన్లు డ్యూయల్‌సి మ్‌తోనే వస్తున్నాయి. అయితే, ఒక నంబర్‌ను ప్రధానంగా వాడుతున్న యూజర్లు, రెండో నంబర్‌ను ఎప్పుడో కాని వాడటం లేదు. అలా దేశంలో ఫోన్ నంబర్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, వాడుతున్నవి మాత్రం కొన్నే ఉంటున్నాయి. ఆ రెండో నంబర్‌ను కంపెనీలు కూడా తొలగించకుండా అలాగే వదిలేస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే నంబర్లకు ప్రత్యేకంగా రిచార్జ్ పెట్టాలని ట్రాయ్ భావిస్తున్నట్టు జాతీయ మీడియా తెలిపింది. నంబర్‌కు కూడా రిచార్జ్ తప్పనిసరి చేస్తే యూజర్లు అదనపు భారంగా భావించి రెండో నంబర్‌ను వదిలేసుకొంటారన్నది ట్రాయ్ ఆలోచనగా తెలుస్తున్న ది. నంబర్లను రెగ్యులర్‌గా వాడకపోయినా కంపెనీలు వాటిని అలాగే కొనసాగిస్తే.. ఆయా టెలికం సంస్థలపై పెనాల్టీ కూడా విధించేలా నిబంధనలు రూపొందిస్తున్నట్టు సమాచారం.
కంపెనీల నుంచి వసూలు
నంబర్లకు చార్జీలను వినియోగదారుల నుంచి కాకుండా టెలికం కంపెనీల నుంచి ట్రాయ్ వసూలు చేయాలని భావిస్తున్నది. ఆ భారాన్ని కంపెనీలు వినియోగదారులపై మోపేందుకు కూడా వెసులుబాటు ఉంటుం ది. ట్రాయ్‌కి టెలికం కంపెనీలు ముందుగా చార్జీలు చెల్లించి, వినియోగదారుల నుంచి తర్వాత వసూలు చేసుకొంటాయి. టెలికం కంపెనీలకు ప్రభుత్వం స్పెక్ట్రంతోపాటు నంబరింగ్ స్పేస్‌ను కూడా కేటాయిస్తుంది.
మోదీ ప్రభుత్వం గత ఏడాది అమల్లోకి తెచ్చిన టెలికం చట్టంలో కూడా నంబర్లకు ప్రత్యేకంగా చార్జీలు వసూలు చేయాలని ఉన్నది. పలు దేశాల్లో ఇలాంటి విధానం ఇప్పటికే నడుస్తున్నది. ఆస్ట్రేలియా, బెల్జియం, సింగపూర్, ఫిన్లాండ్, బ్రిటన్, నెదర్లాండ్స్ తదితర దేశాల్లో నంబర్లకు చార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే, ఈ చార్జీలు ఏ విధానంలో వసూలు చేస్తారన్నదానిపై స్పష్టత లేదు. అంటే, నెలనెలా వసూలు చేయాలా? ఒకేసారి నంబర్ అలాట్ చేసినప్పుడు వసూలు చేయాలా? అన్న విషయం ముందుముందు నిర్ణయించనున్నారు.






