26 July, 2026 | 1:10 AM

సింగరేణి లేని తెలంగాణను ఊహించుకోలేం

27-06-2024 04:19 AM
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్,జూన్ 26 (విజయక్రాంతి): సింగరేణి లేని తెలంగాణను ఊహించుకోవడం అసాధ్యమని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం హిమాయత్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. సింగరేణి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. తెలంగాణ వస్తే బొగ్గు గనులు మనకు ఉంటాయని, అందులో మన పిల్లలకు ఉద్యోగాల వస్తాయని భావించామని గుర్తుచేశారు. రాష్ట్రం వచ్చాక కేసీఆర్ ఇచ్చిన మాటకు భిన్నంగా వ్యవహరించారని, కేంద్ర ప్రభుత్వానికి రాసిచ్చారని ఆరోపించారు. కేసీఆర్ చేసిన పాపానికి సింగరేణి ప్రమాదంలో పండిందని ఆందోళన వ్యక్తం చేశారు. అదానీ, అంబానీ కంపెనీలు కొనుగోలు చేసేందుకు కుట్ర చేస్తే అందుకు కేసీఆర్ సహకరించారని ఆరోపించారు.

సింగరేణి లేకపోతే బొగ్గు ఆధారిత పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లితుందన్న కూనంనేని.. ఇప్పటికే కోయగూడెం ప్రైవేటుకు ఇచ్చేశారన్నారు. సింగరేణిని ప్రైవేటుపరం చేయమని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చెబుతూనే వేలం వేస్తూ మోదీ కుట్రలో భాగమయ్యాయరని మండిపడ్డారు. కిషన్‌రెడ్డి సౌమ్యుడు అనుకు న్నామని, కానీ తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. గతంలో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన బొగ్గు గనుల లీజును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత సీపీఐకి ఉందన్న కూనంనేని జూలై 5న బంద్‌కు పిలుపునిస్తామని, 15 రోజుల పాటు నిరహా రదీక్షలు, కలెక్టరేట్ ముట్టడి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం విషయంలో ధైర్యంగా ఉండాలని, ప్రజల తరఫున పోరాటానికి సిద్ధం కావాలన్నారు.