26 July, 2026 | 2:11 AM

సెప్టెంబర్ తర్వాత కొత్తసార్లు!

27-06-2024 04:12 AM
  • నియామక ప్రక్రియ వేగవంతానికి సర్కారు చర్యలు

డీఎస్సీషెడ్యూల్లో మార్పు ఉండబోదంటున్న ప్రభుత్వం

ఒకట్రెండు రోజుల్లో పూర్తి షెడ్యూల్ విడుదలకు సన్నద్ధం

హైదరాబాద్, జూన్ 26(విజయక్రాంతి): సెప్టెంబర్ తర్వాత స్కూళ్లకు కొత్త టీచర్లు రానున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వీలైనంత త్వరగా డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకాలు చేపట్టాలని యోచిస్తోంది. డీఎస్సీని వాయిదా వేయాలనే డిమాండ్లను పక్కన పెట్టి షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణకు సర్కారు సిద్ధమవుతోంది. ఒకవేళ వాయిదా వేస్తే ఆ ప్రక్రియ ఇక ఎప్పటికీ ముందుకు సాగదనే భావనలో ప్రభుత్వం ఉందని, సెప్టెంబర్ వరకు మొత్తం ప్రక్రియ పూర్తి చేసి, పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులను కేటాయించాలని యోచిస్తున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

జూలైలోనే పరీక్షలు!

డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 11,062 టీచర్ పోస్టులను  ప్రభుత్వం భర్తీ చేస్తోంది. దరఖాస్తు స్వీకరణ గడువు ఈనెల 20తో ముగిసింది. తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం జూలై 17 నుంచి 31 వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. ఓ నెల రోజులపాటు డీఎస్సీని వాయిదా వేసి, ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే సెంటర్లను ఫైనల్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పట్లో డీఎస్సీని వాయిదా వేస్తే తర్వాత మళ్లీ ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించడానికి సెంటర్లు దొరికే పరిస్థితి ఉండదని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

ముందస్తుగా షెడ్యూల్ ప్రకారం డీఎస్సీ పరీక్షలకు మరో 20 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇంతవరకు ఏ రోజు ఏ పరీక్ష జరగుతుందనే షెడ్యూల్‌ను ప్రకటించకుంటే ఎలా? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు ఎస్జీటీతోపాటు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సన్నద్ధమవుతున్నారు. సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించకుంటే దేనికి ముందు ప్రిపేర్ అవ్వాలో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఒకట్రెండు రోజుల్లో పూర్తి షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించే అవకాశం ఉంది.s

తగ్గనున్న టీచర్ల కొరత

ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేయడం ద్వారా చాలా స్కూళ్లలో టీచర్ల కొరత తగ్గనుంది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనుంది. చాలా స్కూళ్లలో సాంఘికశాస్త్రం, గణితం, బయోలాజికల్ సైన్స్ సబ్జెక్టు టీచర్లతోపాటు హిందీ, తెలుగు, ఇంగ్లిష్ లాంగ్వేజీలకు టీచర్ల కొరత ఉంది. సబ్జెక్టు టీచర్లు లేకుండానే చదువులు సాగిస్తున్నారు. టీచర్ల నియామక ప్రక్రియ సజావుగా సాగితే ఈ కొరత కొంతవరకు తీరనుంది.