రోడ్లపై తిరుగుతున్న పశువుల పట్టివేత
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో గత కొద్ది రోజులుగా రహదారులపై విచ్చలవిడిగా సంచరిస్తున్న ఆవులు, ఎద్దుల కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పాటు ప్రమాదాల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు మంగళవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రోడ్లపై తిరుగుతున్న పశువులను పట్టుకుని మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. స్థానిక బైల్ బజార్, డాక్టర్స్ లైన్స్, వివేక్ చౌక్, జయశంకర్ చౌరస్తా, శివాజీ చౌక్, ఖానాపూర్ రోడ్డుతో పాటు రద్దీ ప్రాంతాల్లో సంచరిస్తున్న ఆవులు, ఎద్దులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం ఆయా పశువుల యజమానులను గుర్తించి అపరాధ రుసుము విధించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ... రోడ్లపై పశువులను వదలొద్దని ఇప్పటికే నాలుగు సార్లు ప్రెస్ నోట్ ల ద్వారా యజమానులను హెచ్చరించినప్పటికీ స్పందన లేకపోవడంతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇకపై కూడా పశువులను రహదారులపై స్వేచ్ఛగా వదిలేస్తే మరింత కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. పట్టణంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా, ప్రమాదాలను నివారించేందుకు పశువుల యజమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.






