డివైడర్‌ను ఢీ కొట్టిన కారు
ఒకరు మృతి, మరో నలుగురికి గాయాలు
తూప్రాన్ పేట వద్ద ఘటన
చౌటుప్పల్, మే 5: నిర్మాణంలో ఉన్న డివైడర్ను కారు బలంగా ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో నలుగురు గాయాల పాలైన ఘటన తూప్రాన్ పేట సమీపంలో మంగళవారం ఉదయం జరిగింది. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ కృష్ణానగర్లో నివసించే రుద్రరాజు వీర వెంకటరామరాజు(40) సినిమా షూటింగ్లకు క్యాటరింగ్ పనులు చేస్తుంటారు.
మంగళవారం ఉదయం ఆయన తన టీమ్ సభ్యులు నాయుడు, రామకృష్ణ, రమేష్ కుమార్, శ్రీనివాసరాజులతో కలిసి టయోటా క్వాలిస్ కారులో (ఏపీ37 ఏజి3999) హైదరాబాద్ నుండి మల్కాపురం వైపు సినిమా షూటింగ్ పనుల నిమిత్తం బయలుదేరారు. కరీంనగర్కు చెందిన తిప్పని శ్రీకర్ వాహనాన్ని నడుపుతుండగా, ఉదయం 6:10 గంటల సమయంలో తూప్రాన్పేట గ్రామ పరిధిలోని కొత్త బ్రిడ్జి వద్దకు రాగానే కారు అదుపు తప్పి ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టిందన్నారు.
దీంతో వెనుక సీటులో కూర్చున్న వెంకటరామరాజు తలకు తీవ్ర గాయమైందన్నారు. అలాగే వాహనంలోని మిగతా నలుగురికి పలుచోట్ల గాయాలయ్యాయన్నారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ప్రైవేటు వాహనంలో అబ్దుల్లాపూర్ మెట్ లోని మనోజ్ఞ ఆస్పత్రికి తరలించారన్నారు. అయితే వెంకటరామరాజను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారన్నారు. మృతుడి తమ్ముడు గుంటూరు సాయి రవి వర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ పోలీసులు తెలిపారు.






