6 May, 2026 | 3:58 AM

తెలంగాణలో అధికారం మనదే

06-05-2026 02:30 AM
  1. పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలి
  2. బీజేపీ శ్రేణులకు ఎంపీ రఘునందన్ రావు పిలుపు 

మహబూబాబాద్, మే 5 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్రంలో అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి, గ్రామస్థాయి నుంచి పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. రాష్ట్ర రాజధానిలో నిర్వహించే ప్రధాని సభ విజయవంతం కోసం మహబూబాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎల్‌వో స్థాయి నుంచి పార్టీని పటిష్ట పరచాలని, కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. దేశమంతా ప్రధాని నాయకత్వాన్ని బలపరుస్తోందని, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇందుకు నిదర్శనం అన్నారు. ప్రణాళికబద్ధంగా పార్టీ క్యాడర్ పనిచేయాలన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయకపోవడంపై ప్రజల పక్షాన నిలిచి ప్రశ్నించాలన్నారు. రాష్ట్ర రాజధానిలో నిర్వహించే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.