14 August, 2026 | 2:16 AM

మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై కేసు

25-05-2024 01:46 AM

భూ కబ్జా చేశాడంటూ బాధితుడి ఫిర్యాదు

కేసు నమోదు చేసిన చేవెళ్ల పోలీసులు

రంగారెడ్డి, మే 24 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో భూ కబ్జా కేసు నమోదైంది. జీవన్‌రెడ్డి తన భూమిని ఆక్రమించాడంటూ రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లికి చెందిన దామోదర్‌రెడ్డి శుక్రవారం చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. 2022లో రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 32,35,36,38లలో దామోదర్‌రెడ్డి 20.20 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.

ఆ భూమిలోని కొంత స్థలంలో ఆయన తండ్రి పరమ్‌రెడ్డి పేరుతో పంక్షన్ హాల్‌ను నిర్మించారు. అయితే, 2023లో తన వ్యవసాయ స్థలం సమీపంలోనే జీవన్‌రెడ్డి కొంత భూమిని కొనుగోలు చేశాడు. అనంతరం సమీపంలోని దామోదర్ రెడ్డికి చెందిన పంక్షన్ హాల్‌ను పడగొట్టి అక్కడే మరో భవనం నిర్మించాడు. అంతేకాదు, తాను పొలంలోకి తాను వేళ్లేందుకు ప్రయత్నిస్తే.. జీవన్‌రెడ్డి పంజాబ్ గ్యాంగ్, రౌడీమూకలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తన భూమిని తనకు తిరిగి ఇవ్వాలని జీవన్‌రెడ్డిని పలుసార్లు కోరితే.. మారాణాయుధాలతో బెది రింపులకు పాల్పడుతున్నట్లు బాధితుడు ఆరోపించాడు.

తనకు జీవన్‌రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని, ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరాడు. జీవన్‌రెడ్డి కబ్జా చేసిన తన పొలాన్ని తిరిగి తనకు ఇప్పించాలని బాధితుడు పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు జీవన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 447, 427, 341, 386, 420, 506 కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.