అవినీతి నోట్ల కట్టలు
సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జార్ఖండ్‌లోని ఓ ఇంట్లో నోట్ల కట్టలు బయట పడడం సంచలనం కలిగిస్తోంది. ఇదంతా కూడా లెక్కల్లోకి రాని నల్లధనమేనని, ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం దాదాపు 30 కోట్ల వరకు ఉండవచ్చని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చెబుతున్నారు. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేసిన మాజీ చీఫ్ ఇంజినీర్ వీరేంద్ర రామ్‌ను గత ఏడాది మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో భాగంగా జార్ఖండ్ రాజధాని రాంచీసహా వీరేంద్రకు చెందిన పదికిపైగా చోట్ల సోమవారం దాడులు జరిగాయి. ఈ క్రమంలోనే జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి అలంఘీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌లాల్‌కు సహాయకుడిగా పని చేస్తున్న వ్యక్తికి చెందినదిగా భావిస్తున్న వ్యక్తి ఇంట్లో ఈ నోట్ల గుట్టలు దర్శనమిచ్చాయి.
ఓ గదిలో ఈ నోట్ల కట్టలను పేర్చి ఉన్న దృశ్యాలు చూసి ఈడీ అధికారులు సైతం నివ్వెరపోయారు. ఈ సొమ్మును లెక్క పెట్టడానికి బ్యాంకుల నుంచి మిషన్లు తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆలంఘీర్ వద్ద సహాయకుడిగా పని చేస్తున్న సంజీవ్‌కు పదిమంది మంత్రుల వద్ద పని చేసిన అనుభవం ఉంది. ఈ కారణంగానే మంత్రి ఆయనను నియమించుకున్నారని అంటున్నారు. పలు ప్రభుత్వ పథకాల అమలులో అవకతవకలకు పాల్పడ్డారని, రూ.100 కోట్లమేర కూడబెట్టాడని వీరేంద్రపై ఆరోపణలున్నాయి. ఇటీవలి కాలంలో అధికారులు, రాజకీయ నేతల నివాసాలపై ఈడీ జరిపే దాడుల్లో పట్టుబడుతున్న నగదు, బంగారం, ఇతర విలువైన ఆభరణలను చూస్తే దేశంలో నల్లధనం ఎంతగా పెరిగిపోయిందో అర్థమవుతుంది. ఎన్నికల వేళ పోలీసులు జరుపుతున్న సోదాల్లో వందల కోట్ల నగదు పట్టుబడి నట్లు ప్రకటించింది.
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పట్టుబడిన మొత్తం భారీగా ఉన్నట్లుకూడా ఈసీ చెప్తోంది. అంటే, ధనదాహం ఎంతగా పెరిగిపోయిందో అర్థమవుతోంది. అధికారులే కాదు, రాజకీయ నేతలు కూడా ఈ విషయంలో తక్కువేమీ తినలేదు. అధికారం అనేది ప్రజాసేవకు సోపానంగా భావించాల్సిన వీరు దాన్ని అక్రమ సంపాదనకు మార్గంగా చేసుకోవడం దురదృష్టం. జార్ఖండ్‌లో పెద్ద ఎత్తున అక్రమ సంపాదన పట్టుబడడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఓ కాంగ్రెస్ ఎంపీకి సంబంధించి ఒడిశా, జార్ఖండ్‌లలో ఆదాయం పన్ను శాఖ ఏకకాలంలో జరిపిన దాడుల్లో 300 కోట్లకు పైగా నగదు పట్టుబడడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. అవినీతి కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా అరెస్టయి ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. జార్ఖండ్‌లో పట్టుబడిన నగదు గుట్టలపై ప్రధాని మోడీ సైతం స్పందించారు. ఒడిశాలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ, జార్ఖండ్‌లో అవినీతి ఇంకా ముగియలేదని, మంత్రులు దోచుకున్న కోట్లాది రూపాయల నల్లధనం అంతటినీ రాబోయే అయిదేళ్లలో వెలికి తీస్తామని అన్నారు.
ఈ నల్లధనం జాఢం ఒక్క జార్ఖండ్‌కే పరిమితం కాలేదు. పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్‌లో, డీఎంకే అధికారంలో ఉన్న తమిళనాడులో మంత్రులు సైతం అవినీతి ఆరోపణలపై అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అయితే ఆప్ మంత్రులతోపాటు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా జైల్లోనే ఉన్నారు. ఈ కుంభకోణం అంతులేని కథగా సాగుతోంది. దీని మూలాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు ఈడీ, ఐటి జరిపిన దాడులన్నీ కూడా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలే కావడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ విపక్షాలపై కుట్ర పూరితంగా దాడులు చేయిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అంద రూ అవినీతి మరక అంటని వాళ్లేనా అన్న సామాన్యుడి అనుమానానికి సమాధానం లేదు.






