ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సర్వం సిద్ధం
27న పోలింగ్.. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు
605 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు.. భారీగా పోలీసు బందోబస్తు
గతం కంటే తగ్గిన పట్టభద్రుల ఓటర్ల సంఖ్య
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు: సీఈవో
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): వరంగల్, ఖమ్మం, నల్ల గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుండటంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాలు.. 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 4,63,839 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 2,88,189 మంది, మహిళలు 1,75,645 మంది, ఇతరులు 5 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు.
605 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో దాదాపు 1,400 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఓటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ సమయం ముగిసినప్పటికీ క్యూ లైన్లో ఓటర్లు ఉంటే ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
నేటితో ప్రచారానికి తెర..
ఈ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో సోమవారం ఉపఎన్నికకు పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు 48 గంటల ముందే అంటే శనివారంతోనే ప్రచారం ముగియనుంది. ఈ ఎన్నికలో 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్‌ఎస్ నుంచి ఏనుగు రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్‌రెడ్డితో పాటు స్వతంత్రులుగా కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్కా జడ్సన్, కోచింగ్ సెంటర్ నిర్వాహకులు అశోక్ తదితరులు ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు తమ శక్తివంచన లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
బీఆర్‌ఎస్ తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ముఖ్య నాయకులు విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి విజయం కోసం కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యేలు గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న బక్కా జడ్సన్, అశోక్ తదితరులు ఆయా రాజకీయ పార్టీలకు దీటుగానే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బక్కా జడ్సన్‌కు తెలంగాణ ఉద్యమకారులు మద్దతుగా నిలిచారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై జడ్సన్ పోరాటం చేశారని, అందుకే మద్దతు ఇచ్చామని జర్నలిస్టు విఠల్, పృథ్వీ తెలిపారు.
తగ్గిన ఓటర్ల సంఖ్య..
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2021లో జరిగిన ఎన్నికల సమయంలో 5,05,565 మంది ఓటర్లు ఉండగా ఇప్పుడు ఆ ఓటర్ల సంఖ్య 4,63,839కు తగ్గింది. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఓటు నమోదు కోసం రాజకీయ పార్టీలు విస్తృత ప్రచారం చేశాయి. పట్టభద్రలు ఓటు నమోదుకు కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించారు. ఉపఎన్నిక వచ్చేసరికి ఓటు నమోదు విషయంలో ప్రచారం చేపట్టకపోవడం.. పట్టభద్రులు కూడా ఓటు నమోదుకు ఎక్కువగా ఆసక్తి చూపలేదని చెబుతున్నారు. దీంతో గతంలో ఓటు హక్కును వినియోగించుకున్న వారితో పాటు కొత్తగా గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసిన వారు కూడా నమోదు చేయించుకోలేదని చెబుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు: సీఈవో వికాస్‌రాజ్
ఉపఎన్నిక జరిగే మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు కేంద్ర ఎన్నికల సంఘం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయివేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం సెలవు ఇవ్వాలని ఈసీ నిబంధనలు లేవని సీఈవో తెలిపారు. ఓటు వేసేందుకు వీలుగా పని గంటల్లో వెసులుబాటు కల్పించాలని, ప్రత్యేక పర్మిషన్ ఇవ్వాలని యాజమాన్యాలకు సూచించారు.
ఓటర్ల వివరాలు, పోలింగ్ స్టేషన్ల సంఖ్య..
క్ర.సం జిల్లా పోలింగ్ స్టేషన్లు మొత్తం
పట్టభద్రుల ఓటర్లు
1. సిద్దిపేట 5 4,679
2. జనగాం 27 23,419
3. హనుమకొండ 67 43,729
4. వరంగల్ 59 43,812
5. మహబూబాబాద్ 36 34,933
6. ములుగు 17 10,299
7. జయశంకర్ భూపాలపల్లి 16 12,535
8. భద్రాద్రి కొత్తగూడెం 55 40,106
9. ఖమ్మం 118 83,879
10. యాదాద్రి భువనగిరి 37 34,080
11. సూర్యాపేట 71 51,497
12. నల్లగొండ 97 80,871
605 4,63,839






