కులాల ఓట్లకు పార్టీల గాలం

26-04-2024 01:50:31 AM

l సామాజిక వర్గాల వారీగా ఎంపీ అభ్యర్థుల సమావేశాలు

l పగలు ప్రచారం.. రాత్రి మంతనాలు

రంగారెడ్డి, ఏప్రిల్25(విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల ప్రచారం జిల్లాలో జోరందుకుంది. జిల్లా పరిధిలో ఉన్న ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లు చేవెళ్ల, భువనగిరి, మాల్కజిగిరి, నాగర్‌కర్నూల్, మహబుబ్ నగర్‌కు సంబంధించి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీ నేతలంతా పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నారు. రంగంలోకి తమ ముఖ్య అనుచరులను దింపుతున్నారు. ప్రధానంగా కుల సంఘాల ఓట్లపై దృష్టి సారిస్తున్నారు. ఆయా కులాల మద్దతు కూడగట్టుకుని, పలుకుబడి ఉన్న నేతలను కలుసుకొని ఆయా సంఘాల ఓట్లన్ని తమకు పడేలా వారిని ఒప్పిస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వారిగా ఓటర్ల జాబితాను సామాజిక వర్గాలుగా గుర్తించి వారిని మచ్చిక చేసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. పగలు ఆయా నియోజకవర్గాలో ప్రచారం చేస్తూ రాత్రిపూట ఓట్ల మంతనాలను సాగిస్తున్నారు. 

లెక్కలు కడుతూ.....

మెజార్టీ సామాజిక వర్గాల మద్దతు లభిస్తే సులువుగా గెలవచ్చని అభ్యర్థుల భావన. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతాల వారీగా వచ్చిన ఓట్లను బేరీజు వేసుకొంటున్నారు. మండలం, గ్రామం, వార్డుల వారీగా కులాల ప్రతిపాదికన ప్రత్యేక నివేదికలు రూపొందిస్తున్నారు. వారి మద్దతును కూడగట్టేందుకు ఆయా సామాజికవర్గాల నేతలకే బాధ్యతలు ఇస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 50 శాతానికిపైగా ఓటర్ల మద్దతు కూడగడితే విజయం సాధ్యమని భావిస్తున్నారు. అందుకు తటస్థ ఓటర్లకు ఆకట్టుకొనే పనిలో నిమగ్నం అయ్యారు. స్థానిక సమస్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ హామీలు ఇస్తున్నారు. కమ్యూనిటీ హాళ్లు, గ్రామ దేవతల గుడులు, బడులు, విగ్రహాల ఏర్పాటు, కాలనీల్లో ప్రధాన సమస్యలను ప్రజలు కూడా చెబుతున్నారు. అభ్యర్థులు ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. ప్రచారంలో ప్రధానం గా గ్రామ, వార్డు, మున్సిపాలిటీ, పురపాలికలో కార్యకర్తలపైనే ఎక్కువగా నేతలు ఆధారపడుతున్నారు.