కోటా కొట్టేసుడే!

26-04-2024 01:49:11 AM

రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా

n కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలంగాణను ఏటీఎంలా మార్చారు

n కేంద్రంలో బీజేపీ ఉంటే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యం

n కాళేశ్వరంలో అవినీతి చేసిన బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ చర్యలేవి?

n సెప్టెంబర్17ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటిస్తాం

n సిద్దిపేట ఎన్నికల ప్రచారసభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా

సిద్దిపేట, ఏప్రిల్25(విజయక్రాంతి): అధికారంలోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలోని అధిష్ఠానానికి తెలంగాణను ఏటీఎంలా మార్చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరోపించారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారసభలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్‌లో రఘునందన్‌రావును గెలిపించడంతో పాటు తెలంగాణలో 12సీట్లలో బీజేపీని గెలిపించి మోదీకి 400ల సీట్లు ఇచ్చి తిరికి ప్రధాని చేయాలని ప్రజలను కోరారు.

ఇవన్నీ జరగాలంటే ప్రతిఒక్కరూ బీజేపీ గుర్తు అయిన కమలంపై ఓటు వేసి రఘునందన్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. బీజేపీ గెలిస్తే వచ్చే సెప్టెంబర్17ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటిస్తుందని హామీ ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కలిసి చేసిన ముస్ల్లిం రిజర్వేషన్లను కూడా తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేస్తామని బీజేపీ తరుపున హామీ ఇస్తున్నామన్నారు. 

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఇక్కడ ఎంతో అవీనీతి చేశాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిన బీఆర్‌ఎస్‌పై అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిసిపోయాయన్నారు. మూడోసారి మోదీని ప్రధానమంత్రిని చేస్తే తెలంగాణలోని అవినీతిని పూర్తిగా రూపుమాపివేస్తారన్నారు. ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కోరుకుంటున్నా  కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రకటించకుండా అడ్డుపడుతూ మజ్లీస్ పార్టీతో కుమ్మక్కయ్యారన్నారు. రెండు పార్టీలు మజ్లిస్‌కు భయపడతాయన్నారు. 

పదేండ్లలో ఎన్నో క్లిష్టమైన సమస్యలను ప్రధానిగా మోదీ పరిష్కరించారన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలని దేశప్రజలందరూ కోరుకున్నారని కానీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇది కోరులేదన్నారు. అయినా కేవలం ఐదేండ్లలోనే అయోధ్య రామజన్మభూమి కేసును గెలిచి అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేయడంతో పాటు ఆలయ నిర్మాణం పూర్తిచేసి అద్భుతంగా బాలరాముని ప్రాణప్రతిష్టను మోదీ పూర్తి చేశారన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి భారత్‌లో భాగమైన కాశ్మీర్‌ను శాశ్వతంగా భారత్‌తోనే ఉండేలా చేశారని చెప్పారు. ప్రజలు మూడోసారి కూడా కమలాన్ని వికపింపజేసి మోదీని ప్రధానిగా గెలిపించాలని కోరుకుంటున్నారని అర్థమవుతుందని, అందుకే ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంపొందించడానికే తాను వచ్చానన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.  కాబట్టి మెదక్ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి రఘునంద్‌రావును భారీ మెజార్టీతో గెలిపించి మెదక్‌లో కమలాన్ని వికసింపజేసి మరోసారి మోది ప్రధాని కావడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు.

మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు మాట్లాడుతూ ప్రపంచంలో ఆర్థికంగా 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని ప్రధాని మోదీ 5వ స్థానానికి తీసుకువచ్చారని, మోదీని మరోసారి గెలిపిస్తే 3వ స్థానానికి తీసుకువచ్చి భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దుతారన్నారు. మెదక్ ఎన్నికల్లో విజయం సాధించగానే సిద్దిపేట నుండి అయోధ్య వెళ్లి రామున్ని దర్శించుకుందామన్నారు. క్యాబినెట్‌లో సగం బీసీలు ఉండాల్సింది ఇద్దరు బీసీలనే ఎందుకు పెట్టుకున్నావని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పాలమూరు బిడ్డ కూడా ఎమ్మెల్యేగా గెలుపొందిందని ఆమెకు కూడా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదన్నారు. రేవంత్‌రెడ్డి నమ్మించి మోసం చేస్తాడన్నారు. 10పదేండ్ల కేసీఆర్ పాలన, 6నెలల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలంతా బీజేపీ, నరేంద్రమోదీకి ఓటువేస్తామంటు న్నారన్నారు. కామారెడ్డిలో కాషాయం జెండానే కేసీఆర్, రేవంత్‌రెడ్డిలను ఓడించిందని హరీశ్‌రావు, రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా బాధ్యులతో పాటు సిద్దిపేట,  దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 

సభ సక్సెస్‌తో కమలదళంలో జోష్

సిద్దిపేటలో జరిగిన మెదక్ ఎంపీ ప్రచారసభ సక్సెస్ కావడంతో కమలదళంలో కొత్త జోష్ వచ్చింది. మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు, పార్టీ జిలా అధ్యక్షుడు మోహన్‌రెడ్డిల ఆధ్వర్యంలో భారీసంఖ్యల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరై అమిత్‌షా సభను విజయవంతం చేశారు. గతంలో కన్నా భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా సిద్దిపేట సభకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరావడం అందరిలో ఉత్సాహాన్ని పెంచింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు, జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా నాయకురాలు ఆకుల విజయ తదితరుల ప్రసంగాలు కార్యకర్తలో  నూతనోత్తేజాన్ని నింపాయి. కాగా సభాప్రాంగణంలో సహారా ఇండియా పాలసీలలో డబ్బులు కట్టిన వారు  తమకు వెంటనే సహాయాన్ని  చెల్లించాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.