ఒడిదుడుకుల మార్కెట్
తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన స్టాక్ సూచీలు
బ్యాంకింగ్, ఐటీ షేర్లలో అమ్మకాలు
ముంబై, మే 8: విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా విక్రయాలు జరపడం, అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలత కారణంగా బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 437 పాయింట్ల వరకూ పతనమై 73,074 పాయింట్ల వరకూ పతనమైన తర్వాత షార్ట్ కవరింగ్ ప్రభావంతో ముగింపులో నష్టాల్ని చాలావరకూ తగ్గించుకుంది. అయినప్పటికీ 45 పాయింట్ల క్షీణతతో 73,466 పాయింట్ల వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 22,368 పాయింట్ల మధ్య ఊగిసలాడి చివరకు ఫ్లాట్‌గా 22,302 పాయింట్ల వద్ద నిలిచింది. ఒక వైపు బ్యాంకింగ్, ఐటీ షేర్లలో అమ్మకాలు, మరోవైపు ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్ షేర్లలో కొనుగోళ్ల లావాదేవీలతో స్టాక్ సూచీ లు రోజంతా ఒడిదుడుకులకు గురయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఆసియాలో టోక్యో, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు నష్టపోయాయి.
ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు
కొద్ది రోజుల నుంచి అదేపనిగా నిధుల్ని మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) బుధవారం పెద్ద ఎత్తున విక్రయాలు జరిపా రు. తాజాగా మార్కెట్లో వీరు రూ. 6,669 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకా లు వెల్లడిస్తున్నాయి. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు మార్కెట్ నుంచి రూ. 8,000 కోట్లకుపైగా వెనక్కు తీసుకున్నారు.
టాటా మోటార్స్ టాప్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా టాటా మోటార్స్ 2.4 శాతం పెరిగింది. పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, లార్సన్ అండ్ టుబ్రో, మారుతిలు లాభపడ్డాయి. మరోవైపు ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనీలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 1 శాతం మధ్య నష్టపోయాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా ఐటీ ఇండెక్స్ 0.57 శాతం తగ్గింది. బ్యాంకెక్స్ 0.38 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 0.29 శాతం చొప్పున క్షీణించాయి. ఎనర్జీ, ఇండస్ట్రియల్స్, యుటిలిటీస్, ఆటో, మెటల్, పవర్, సర్వీసుల సూచీలు పెరిగాయి.






