ఎల్ అండ్ టీ లాభం రూ. 4,396 కోట్లు
రూ.67,079 కోట్లకు చేరిన ఆదాయం
షేరుకు రూ.28 డివిడెండు
న్యూఢిల్లీ, మే 8: ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో కన్సాలిడేటెడ్ నికరలాభం 2024 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో 10 శాతం వృద్ధిచెంది రూ.4,396 కోట్లకు చేరింది. ఆదాయం 15 శాతం పెరిగి రూ.67,079 కోట్ల వద్ద నిలిచింది. బుధవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరు రూ.28 చొప్పున డివిడెండును సిఫార్సుచేసింది. నాల్గవ త్రైమాసికం లో తమ మొత్తం ఆదాయంలో 45 శాతం అంతర్జాతీయంగా సమకూరిందని ఎల్ అండ్ టీ తెలిపింది. 2023 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ కన్సాలిడేటెడ్ నికరలాభం 25 శాతం వృద్ధిచెంది రూ. 13,059 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఎల్ అండ్ టీ షేరు 1.6 శాతం పెరిగి రూ. 3,482 వద్ద ముగిసింది.
రూ.3 లక్షల కోట్ల ఆర్డర్లు
ముగిసిన 2023 ఆర్థిక సంవత్సరం లో ఎల్ అండ్ టీ గ్రూప్‌స్థాయిలో రూ.3.02 లక్షల కోట్ల ఆర్డర్లను సంపాదించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 31 శాతం అధికంగా ఆర్డర్లను సాధించింది. తాము కార్యకలాపాలు నిర్వహించే హైడ్రోకార్బన్ ఆన్‌షోర్, ఆఫ్‌షోర్, నగర రవాణా వ్యవస్థలు, ఎయిర్‌పోర్టులు, రహదారులు, వంతెనలు, రెసిడెన్షి యల్, రెన్యువబుల్, ట్రాన్స్‌మిషన్ తదితర అన్ని విభాగాల్లోనూ ఆర్డర్లు వచ్చాయని కన్‌స్ట్రక్షన్ దిగ్గజం వివరించింది. ముగిసిన ఏడాది సంపాదించిన ఆర్డర్లలో రూ.1.63 లక్షల కోట్ల విలువైన అంతర్జాతీయ ఆర్డర్లు ఉన్నాయని తెలిపింది. మార్చి త్రైమాసికంలోనే రూ. 72,150 కోట్ల ఆర్డర్లు వచ్చాయ న్నది. మార్చి చివరినాటికి కంపెనీ వద్ద రూ.4.75 లక్షల కోట్ల కన్సాలిడేటెడ్ ఆర్డర్ బుక్ ఉన్నది. కంపెనీపై క్లయింట్లకు ఉన్న నమ్మకానికి ఆర్డర్ బుక్ నిదర్శనమని లార్సన్ అండ్ టుబ్రో చైర్మన్, ఎండీ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యం చెప్పారు.






