26 June, 2026 | 2:03 PM

ఏసీబీ వలలో సీసీఎస్ ఇన్‌స్పెక్టర్

14-06-2024 01:25 AM

రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి): అతనో పోలీసు అధికారి. హైద రాబాద్‌లోని సీసీఎస్ (సైబర్ క్రైమ్ స్టేషన్)లోని డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్‌లో ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వం నుంచి రూ. లక్షల్లో వేతనం అందుకుంటున్నా అవి సరిపోవడం లేదంటూ లంచగొండి అవతారం ఎత్తాడు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన మణి రంగారెడ్డి స్వామి అనే వ్యక్తిపై నమోదైన కేసులో నిందితుడిని అనుకూలంగా విచారణ చేయడానికి ఏకంగా రూ.15 లక్షల లంచం డిమాండ్ చేశాడు.

మొదటి విడతలో రూ. 5 లక్షలు చెల్లించిన మణి రంగారెడ్డి స్వామి.. రెండో విడతలో గురువారం రూ. 3 లక్షలు, మిగిలిన డబ్బును శనివారం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాగా, అంత డబ్బు ఇవ్వలేక మణి రంగారెడ్డి స్వామి ఏసీబీని ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్ చామకూర సుధాకర్ రూ. 3 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల వేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులను చూసిన ఇన్‌స్పెక్టర్ డబ్బు బ్యాగును వదిలేసి నడిరోడ్డుపై పరుగులు పెట్టాడు. దీంతో ఏసీబీ అధికారులు ఛేజ్ చేసి మరీ ఇన్‌స్పెక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.  నిందితుడిని నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచి అనంతరం రిమాండ్‌కు తరలించారు.