డీజిల్ దొంగల అరెస్టు
గజ్వేల్, జూన్ 13: నిలిపి ఉంచిన వాహనాల నుంచి డీజిల్ చోరీ చేస్తున్న దొంగలను పట్టుకున్నట్లు గజ్వేల్ సీఐ సైదానాయక్ తెలిపారు. గురువారం అడిషినల్ సీఐ ముత్యంరాజుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 11న మంగళవారం తూప్రాన్ మార్గంలో పోలీసు లు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక ఇన్నోవా వాహనంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా.. వాహనంలో రెండు డీజిల్ క్యాన్లు, ఒక పైపు కనిపించాయి. పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని మియా పూర్‌కు చెందిన కేతావత్ శ్రీను, మరో ఆరుగురు జల్సాలు చేయడానికి డీజిల్ దొంగతనాలు చేస్తున్నట్లుగా గుర్తించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, ఆరుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు.






