నేరాలనివారణ, నేరస్తుల గుర్తింపునకు సీసీ కెమెరాలు ఎంతో కీలకం
ఘట్‌కేసర్ ఇన్స్పెక్టర్ బాలస్వామి
ఘట్‌కేసర్, జూలై 21 (విజయక్రాంతి) : నేరాలనివారణ, నేరస్తుల గుర్తింపుకు సీసీ కెమెరాలు ఎంతో కీలకమని ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ బాలస్వామి అన్నారు. కమ్యూనిటీ సీసీ కెమెరా కార్యక్రమంలో భాగంగా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ డబ్ల్యూఎస్ కాలనీలో స్థానిక దాతల సహకారంతో 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈకార్యక్రమానికి సోమసాని రమేష్, సోమసాని వెంకటేష్, తలతోటి వరమ్మ దాతలుగా సహకారం అందించారు.
ఈసందర్భంగా ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ బాలస్వామి మాట్లాడుతూ ఆధునిక పోలీసింగ్లో సీసీ కెమెరాలు అత్యంత కీలకమైనవని, నేరాల నివారణ, నేరస్థుల గుర్తింపు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణలో సీసీ కెమెరాలు సమర్థవంతంగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ప్రతి కాలనీ, గ్రామం, అపార్ట్మెంట్, వాణిజ్య సముదాయం, విద్యా సంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
అనంతరం ఇన్స్పెక్టర్ బాలస్వామి, ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా దాతలకు ఘట్కేసర్ పోలీసు శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ సీసీ కెమెరా కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేసి, ప్రతి కాలనీ మరియు గ్రామాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలోకి తీసుకువచ్చేందుకు పోలీసు శాఖ కృషి చేస్తోందని అధికారులు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే నేర రహిత, సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.






