19 August, 2026 | 3:57 AM

ఇందిరమ్మ ఇంటికి 230లకే సిమెంట్ బస్తా

19-08-2026 12:00 AM

పారిశ్రామిక తోడ్పాటు హర్షణీయం

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సిమెంట్ పరిశ్రమలు భాగస్వాములు కావాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇందిర్మ ఇళ్లకు సిమెంట్ పరిశ్రమలు కూడా సహకారం అందంచాలని కోరగా, ఒక్కో బస్తాను రూ. 230కి ఇవ్వడానికి యాజమాన్యాలు అంగీకరించాయని మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్ ధరల తగ్గింపుపై ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో పొంగులేటి సమావేశమయ్యారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 శాతం సబ్సిడీతో రూ.5 లక్షల ఆర్థిక స హాయం అందిస్తూ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం లేదని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా (హైదరాబాద్  మినహా) మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు.  సమావేశంలో సిమెంట్ కంపెనీల ప్రతినిధులు, హౌసింగ్ సెక్రటరీ వీపీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.