జననాయగన్ లీక్‌కు సెన్సార్ జాప్యమే కారణం
జన నాయగన్ సినిమా లీక్ ఘటన ఇండస్ట్రీని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనపై స్పందించారు సినీప్రముఖులు స్పందిస్తున్నారు. పలువురు అగ్రహీరోలు, దర్శక నిర్మాతలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తాజాగా కమల్‌హాసన్, రజనీకాంత్, విజయ్ దేవరకొండ కూడా స్పందించారు. “జననాయగన్’ లీక్ అవడం అనుకోకుండా జరిగిన విషయం కాదు.
ఇది వ్యవస్థ వైఫల్య ఫలితం. దీని పనులు సకాలంలో జరిగివుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. సెన్సార్ బోర్డులో జరిగిన విపరీతమైన జాప్యం పైరసీకి అనుకూలమైన వాతావరణాన్ని తెచ్చిపెట్టింది. పైరసీ రాజకీయాలకు అతీతమైంది. అది కళపై, కళాకారుడిపైన చేసే దాడి. వందలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణుల కృషిని ప్రమాదంలో పడేస్తుంది. మనం ప్రేమించే సినిమాను నిలబెడుతున్న వాళ్లపై, నిజాయితీగా పన్ను చెల్లిస్తున్న నిర్మాతలు, థియేటర్ యాజమానులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
వ్యవస్థ విఫలమైనప్పుడు సినిమాను ఎవరు కాపాడుతారు? విడుదల విషయంలో చట్టపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు విచారణ వేగవంతం చేయాలి. గతంలో మీరు నాకు అండగా నిలిచినట్లే, నిజమైన సినిమా ప్రేమికులు ఇప్పుడు కూడా ఏకమవ్వండి. ఈ చిత్రాన్ని థియేటర్లలోనే చూద్దాం. దానికి సహకరించండి” అని కమల్‌హాసన్ పేర్కొన్నారు. రజనీకాంత్ స్పందిస్తూ.. సినిమా లీక్ అయిందని తెలిసి షాక్ అయ్యానని, చాలా బాధగా ఉందని, దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. “జననాయగన్’ సినిమాను రిలీజ్‌కు ముందు లీక్ చేయడం ఆగ్రహం తెప్పిస్తోంది. నా కెరీర్ ప్రారంభంలో ఇలాంటి బాధాకర ఘటన ఎదుర్కొన్నా. ఆ టైమ్‌లో ఎవరో కావాలని చేశారని అనిపించింది. ఆశలన్నీ కోల్పోయా. సినిమా అనేది హీరోగా నా ఒక్కరికే కాదు దర్శకులు, నిర్మాతలు, నటీనటులు.. ఇలా అందరి కల. జననాయగన్ సినిమా లీక్ వెనక ఎవరున్నారనేది వీలైనంత త్వరగా గుర్తించాలి.
ఇతరుల గురించి ఒక్క క్షణం ఆలోచించకుండా తప్పులు చేసేవారు ఎలా ఉంటారో ఈ ఘటనతో మరోసారి అర్థమవుతోంది. జననాయగన్ సినిమా టీమ్ అందరికీ నా మద్ధతు తెలియజేస్తున్నా” అన్నారు. ‘జన నాయగన్‘ మూవీ లీక్ ఘటన బాధ కలిగించిందని టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ పేర్కొన్నారు. ఇక ఈ చిత్ర లీక్ ఘటనను ఖండిస్తూ హీరోలు మంచు విష్ణు, మంచు మనోజ్, విజయ్ ఆంటోని, దర్శకులు శ్రీను వైట్ల, రాజ్‌కుమార్ పెరియసామి, హెచ్ వినోద్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.




