నేటి నుంచి రాష్ట్రంలో జనగణన
మే 10 వరకు నిర్వహణ
సెల్ఫ్ ఎన్యుమరేషన్‌కు అవకాశం
జన గణన డైరెక్టర్ భారతి హోళికేరి
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జనగణన ప్రక్రియకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి మే 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. జన గణన ప్రక్రియలో భాగంగా నిర్వహించే స్వీయ ధ్రువీకరణ, తొలి విడత గణనపై శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
సాధారణంగా జనగణన సిబ్బంది ప్రతి ఇంటి కీ వచ్చి వివరాలు సేకరిస్తారని, అయితే సాంకేతికతను జోడించి ఈసారి ప్రజలే నేరుగా తమ వివరాలను ఆన్‌లైన్ (సెల్ఫ్ ఎన్యుమరేషన్ ) నమోదు చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ప్రజలు దేశంలో ఎక్కడ ఉన్నా సరే, ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. అయితే.. ఇది ప్రతి ఒక్కరికీ తప్పనిసరి కాదు, కేవలం ఒక ఆప్షన్ మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు. జనగణనలో భాగంగా మొత్తం 33 ప్రశ్నలు ఉంటా యని డైరెక్టర్ వివరించారు.
ఆన్‌లైన్‌లో సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునే వారు కేవలం 27 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని, మిగిలిన 6 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను, రెండో దశలో ఎన్యుమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు వారికి నేరుగా తెలియజేయాల్సి ఉంటుందని భారతి హోలికేరి వివరించారు.సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్న వారు ఆ తర్వాత ఎన్యుమరేటర్ వచ్చినప్పుడు తమకు వచ్చిన రిఫరెన్స్ నంబర్‌ను చూపిస్తే సరిపోతుందన్నారు. ఒక కుటుంబం సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్నా, లేకపోయినా, రెండో దశలో ఎన్యుమరేటర్ ప్రతి ఇంటికీ రావడం తప్పనిసరి అని డైరెక్టర్ తెలిపారు.మే 10వ తేదీ వరకు గడువు ఉన్నందున, ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.






