26 April, 2026 | 2:12 AM

నకిలీ పత్తి విత్తనాల రాకెట్ గుట్టురట్టు

26-04-2026 12:32 AM
  1.   150 విత్తన ప్యాకెట్లు, నగదు స్వాధీనం
  2. నలుగురు నిందితుల అరెస్ట్
  3. వివరాలు వెల్లడించిన డీఎస్పీ జీవన్‌రెడ్డి

ఆదిలాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నకిలీ పత్తి విత్తనాల విక్రయాల దందాను పోలీసులు గుట్టురట్టు చేశారు. శనివారం బేల పోలీ స్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ జీవన్‌రెడ్డి వివరాలు వెల్లడిం చారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పక్కా సమాచారంతో సాంగిడి గ్రామ శివారులో రోడ్డు ప్రక్కన కొంతమంది వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలియడంతో శనివారం తనిఖీలు నిర్వహించామన్నారు.

విత్తనాలు నకిలీవా? కాదా? అని నిర్ధారించేందుకు వ్యవసాయ శాఖ అధికారిని సం ఘటన స్థలానికి పిలిపించి పరిశీలించామని చెప్పారు. దీంతో నకిలీ పత్తి విత్తనాలు అని తేలినట్లు డీఎస్పీ తెలిపారు. తనిఖీలలో నింది తుడు జిట్టావార్ కిషోర్ రెడ్డి అనే వ్యక్తి గుజరాత్‌కు చెందిన నరేష్ క్రాప్ సైన్స్ కంపెనీలో కమిషన్ ఏజెంట్‌గా పని చేస్తూ, అదే కంపెనీలో పని చేసే ధర్మేష్ కచ్చడియా అనే వ్యక్తితో కలిసి కుట్రపన్ని నరేష్ క్రాప్ సైన్స్ సంస్థకి సంబంధించిన ‘మౌళి ఉన్న నిజమైన ప్రత్తి విత్తన ప్యాకెట్‌ను ‘మౌళి పేరుతో నకిలీ పత్తి విత్తనాలను తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు.

గత రెండు నెలలుగా గుజరాత్ నుంచి నవత ట్రాన్స్‌పోర్ట్ ద్వారా సుమారు 4,500 నకిలీ విత్తనాల ప్యాకెట్లు తెప్పించి, అందులో 4,000 ప్యాకెట్లను మహారాష్ట్రలో రక్తావర్ పవన్ ద్వారా, 350 ప్యాకెట్లను నవగరే కునాల్, కుల్దీప్ టాక్రె ద్వారా రైతులకు అసలైన విత్తనాలుగా నమ్మించి విక్రయించినట్లు విచారణలో వెల్లడైందన్నారు.

తనిఖీల్లో 150 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నకిలీ విత్తనాల విక్రయం ద్వారా వచ్చిన రూ. 60,000 నగదు, నిందితులు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్యాకెట్లపై కంపెనీ పేరు, తయారీ తేదీ, పరీక్ష తేదీ, గడువు తేదీ, ఎమ్మార్పీ వంటి వివరాలు లేకపోవడం గమనించామన్నారు. 

రెండు ప్యాకెట్లను నమూనాలుగా తీసుకొ ని పరీక్షకు పంపించి, మిగతా వాటిని స్వాధీ నం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులు జిట్టావార్ కిషోర్ రెడ్డి, రక్తావర్ పవన్, నవగరే కునాల్, కుల్దీప్ టాక్రెలను అదుపులోకి తీసుకోగా, ధర్మేష్ కచ్చడియా కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిదర్, ఎస్‌ఐ మధుకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.