రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండవు
కాంగ్రెస్ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ కన్వీనర్ కపిలవాయి
హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేస్తూ.. రాష్ట్రాల హక్కులను హరిస్తోందని కాంగ్రెస్ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దీలిప్‌కుమార్ విమర్శిం చారు. పంచాయతీరాజ్ చట్టంలోని గైడ్‌లైన్స్‌ను పాటించడం లేదని, గ్రా మ పంచాయతీల నిధులపైన కూడా కేంద్రం అజమాయిషీ చేస్తోందని మండిపడ్డారు.
గురువారం ఆయన గాంధీభవన్‌లో మాజీ మంత్రి పుష్పలీలతో కలిసి మీడియాతో మాట్లాడు తూ.. బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేసే ప్రమాదం ఉందన్నారు. బీజేపీ 400 సీట్లు గెలిస్తే రాష్ట్రాలు తమ హక్కులను పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. బీజేపీ కనీసం 200 సీట్లు కూడా గెలిచే అవకాశం లేదన్నారు.
కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. మాజీ మంత్రి పుష్పలీల మాట్లాడుతూ.. మోదీ గ్రాఫ్ 100 శాతం పడిపోయిందని, ఓడిపోతామనే ఫ్రస్టేషన్‌లో బీజేపీ నేతలున్నారని ఆమె తెలిపారు. రైతుల గురించి బీజేపీ నేతలు ఎన్నడూ మాట్లాడలేదని, నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను మోదీ ఇబ్బందులకు గురి చేశారని ఆమె విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ గెలవడం, రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రి కావడం ఖాయమన్నారు.






