శిథిల భవనాలపై బల్దియా నజర్
గత ఏడాది 174 ఉన్నట్టుగా గుర్తించిన అధికారులు
మరోసారి పర్యవేక్షించి కొత్త జాబితా సిద్ధం చేయాలి
18లోగా నివేదిక అందజేయాలని బల్దియా ఆదేశాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (విజయక్రాంతి) : వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా నగరంలో శిథిలావస్థకు చేరిన భవనాలపై బల్దియా అధికారులు దృష్టి సారిస్తున్నారు. మంగళవారం కురిసిన భారీ వర్షంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బస్తీలు, కాలనీలలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
గ్రేటర్‌లో 174 శిథిల భవనాలు
గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షాకాలం వచ్చిందంటే పలు ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. నాలా పరివాహక ప్రాంతాలు, బస్తీలు, కాలనీలలో ఈ ప్రమాదాలు అత్యధికంగా జరుగుతాయి. ముఖ్యంగా చాలా ఏళ్ల క్రితం నిర్మించిన ఇండ్లు, ప్రహరీ గోడలు, సగం కూలిన గోడలు వర్షానికి పూర్తిగా నాని కూలిపోతుంటాయి. ఈ సంఘటనలలో ఎక్కువగా చిన్నారులు, వృద్దులు ప్రమాదాలకు గురవుతుంటారు. కొన్ని సందర్భాలలో ప్రాణాలను కోల్పోతుంటారు. మంగళవారం నగరంలో భారీ స్థాయిలో వర్షం కురవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ముందస్తుగానే అలర్టయ్యారు. శిథిల భవనాలను గుర్తించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. 2022లో మొత్తం 620 శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించగా, 330 నిర్మాణాలను కూల్చివేశారు. మిగతా 290 నిర్మాణాలకు మరమత్తులు చేసుకునేందుకు యజమానులకు అవకాశం కల్పించారు. గతేడాది 174 శిథిల భవనాలను గుర్తించగా.. ఆయా నిర్మాణాలను కూల్చి యాజమానుల నుంచి ఖర్చు వసూలు చేయనుంది.
18 లోగా నివేదిక అందజేయాలి
గ్రేటర్‌లో అత్యధికంగా సికింద్రాబాద్ జోన్, ఆ తర్వాత ఖైరతాబాద్ జోన్‌లో శిథిలావస్థకు చేరిన నిర్మాణాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కూకట్‌పల్లి, చార్మినార్ జోన్లలో ఈ నిర్మాణాలు అధికంగానే ఉండగా, శేరిలింగంపల్లి జోన్‌లో మాత్రం తక్కువ మొత్తంలో ఉన్నట్లు అధికారులు తేల్చారు. గతేడాది గుర్తించిన 174 శిథిల భవనాలను టౌన్ ప్లానింగ్ అధికారులు మరోసారి పరిశీలించి, ప్రస్తుతం వాటి వాస్తవ స్థితిని కమిషనర్‌కి నివేదిక రూపంలో అందించనున్నారు. కొత్తగా ఏమైనా శిథిల భవనాలు ఉన్నట్లుగా అధికారులు గురిస్తే వాటిని కూడా జాబితాలో చేర్చనున్నారు. ఇప్పటికే వర్షాకాలం ముందస్తు యాక్షన్ ప్లాన్‌పై చర్చించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులతో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 13న ఎన్నికలు పూర్తయిన వెంటనే శిథిల భవనాల గుర్తింపు కోసం ప్రత్యేక కసరత్తు చేయనున్నారు.






